బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (15:31 IST)

అనుమానం పెనుభూతమైంది... పచ్చని సంసారం చిన్నాభిన్నమైంది..

murder
కట్టుకున్న భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇది పెనుభూతమైంది. దీంతో పచ్చని సంసారం చిన్నాభిన్నమైంది. ఇద్దరు పిల్లలను అనాథలయ్యారు. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ఈ దారుణం ఈస్ట్ గోదావరి జిల్లా కడియం మండలం కడియపుసావరంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడియపుసావరం వడ్డి వీరభద్రరావు నగర్‌కు చెందిన దూళ్ల సూరిబాబు(38)తో అదేగ్రామానికి చెందిన సత్యశ్రీ(34)కి పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. సూరిబాబు కౌలురైతుగా జీవనాన్ని సాగిస్తున్నాడు. మనస్పర్థల కారణంగా ఎనిమిది నెలల క్రితం పిల్లలతో సత్యశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. సంక్రాంతి పండగ నుంచి విభేదాలు తారాస్థాయికి చేరాయి. సత్యశ్రీ ఇతరులతో ఫోనులో ఎక్కువగా మాట్లాడుతోందని అత్తవారికి సూరిబాబు చెప్పాడు. వారు సర్దిచెప్పి కాపురానికి పంపించారు. 
 
ఈ నెల 14న మరోసారి పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వచ్చేసింది. అక్కడ గొడవ జరగడంతో సూరిబాబు పిల్లలను తీసుకుని తనింటికి వెళ్లిపోయాడు. కాపురానికి రమ్మని మరోసారి అడిగేందుకు గురువారం ఉదయం ఆమె వద్దకు వచ్చాడు. వాగ్వాదం చోటుచేసుకుని భార్యను గ్రాఫ్టింగ్ బ్లేడు (చైనా బ్లేడు)తో గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న సత్యశ్రీని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పిల్లలు అమ్మా లే అమ్మా లే.. అంటూ తల్లిని లేపే ప్రయత్నం చూపరులను కంటతడి పెట్టించింది. 
 
భార్యను కిరాతకంగా హత్యచేసిన సూరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడియం మండలం మాధవరాయుడుపాలెం పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో విగతజీవిగా పడి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరి కుమారుడు వెంకన్నబాబు కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా కుమార్తె వైష్ణవిశ్రీ స్థానిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది.