శనివారం, 10 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 23 మే 2016 (10:48 IST)

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. కోలీవుడ్ దర్శకుడు దుర్మరణం

కర్నూలు జిల్లా డోన్‌ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో కోలీవుడ్ దర్శకుడు దేవరాజ్‌ (57) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శకుడు దేవరాజ్‌ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపుతప్పడంతో వినాయకమూర్తి, లోగనాథన్‌, రాజేంద్రన్‌కు తీవ్రగాయాలయ్యాయి. 
 
స్థానికులు వెంటనే డోన్‌ ఆస్పత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. కానీ దేవరాజ్‌కు గాయాలు కాకపోయినా షాక్‌కు గురై మృతి చెందారని పోలీసులు తెలిపారు. కారు వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
మృతుడి బంధువు రాజేంద్రన్‌ ఫిర్యాదుతో గ్రామీణ ఎస్‌ఐ రామసుబ్బయ్య కేసు నమోదు చేసుకున్నారు. దేవరాజ్‌ తమిళం, తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు, సీరియళ్లు తీశారని రాజేంద్రన్‌ తెలిపారు.