అత్యాచార యత్నం : యువకుడిని కత్తితో పొడిచిన యువతి
తమిళనాడులో అత్యాచారానికి యత్నించిన ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపింది 19 ఏళ్ల యువతి. అనంతరం పోలీసుల ఎదుటు లొంగిపోయింది. యువతి ఆత్మరక్షణ కోసమే యువకుడిని చంపిందని నిర్ధరించుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. ఆమెను కేసు నుంచి తప్పించారు. పోలీసుల నిర్ణయంపై పలువురు ఉద్యమకారులు, న్యాయవాదులు ప్రశంసలు కురిపించారు.
తమిళనాడు తిరవళ్లూరు జిల్లాలో అత్యంత అరుదైన ఘటన వెలుగులోకిి వచ్చింది. తనపై అత్యాచారానికి యత్నించిన 24 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపింది ఓ 19 ఏళ్ల యువతి. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆత్మరక్షణ కోసమే ఆమె ఇలా చేసిందని తెలుసుకున్న పోలీసులు యువతిని కాపాడారు. కేసు నుంచి ఆమెను తప్పించారు.
తిరువళ్లూరు జిల్లా శోలవరం గ్రామంలో 19 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది. ఓ రోజు రాత్రి 8 గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఊరిబయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన అజిత్ కుమార్(24) ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. చిమ్మచీకటి, పొదలున్న ప్రదేశంలో మద్యం సీసా పట్టుకుని ఉన్న యువకుడిని అకస్మాత్తుగా చూసి యువతి హడలిపోయింది. అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించింది. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేసేందుకు కత్తితో బెదిరించాడు యువకుడు. అరుపులు, కేకలు పెడితే చంపుతా అని ఆమె మెడపై కత్తిపెట్టాడు.
తనను వదిలేయమని యువతి ఎంతగా ప్రాధేయపడినా అతడు వినిపించుకోలేదు. దీంతో తనలోని శక్తినంతా కూడగట్టుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడిని ప్రతిఘటించింది యువతి. ఈ క్రమంలోనే అతడి చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. వెంటనే కత్తిని అందుకున్న యువతి అతడిపై దాడి చేసింది. యువకుడు కుప్పకూలే వరకు మెడపై కత్తిపోట్లతో విరుచుకుపడింది. అతడు అక్కడికక్కడే మరణించాడు.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి యువతి లొంగిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్టాన్లే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అత్యాచారానికి యత్నించిన యువకుడు యువతికి దూరపు బంధువని పొన్నెరి డీఎస్పీ కల్పనా దత్ తెలిపారు. అతడు పదో తరగతి మధ్యలో ఆపేశాడని, భార్యతో గొడవపడి ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడని చెప్పారు. మద్యానికి బానిసై ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని, అతనిపై దొంగతనం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు.
ఈ కేసుపై ఎస్పీ అరవిందన్ ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే అజిత్ కుమార్‌ను యువతి చంపిందని తెలిపారు. ఆమెపై సెక్షన్ 302(హత్యాయత్నం) కేసు కాకుడా సెక్షన్ 106(ఆత్మరక్షణ కోసం ఇతరులపై దాడి) కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. యువతిని కేసు నుంచి తప్పించామని, ప్రస్తుతం ప్రభుత్వ నివాసంలో ఉంటోందని వెల్లడించారు. పరిస్థితులు సద్దుమణిగాక ఆమెను ఇంటికి పంపుతామని వివరించారు.
2012లోనూ కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన భర్తను బ్యాట్‌తో కొట్టి చంపింది భార్య. విచారణ అనంతరం ఆమెపై సెక్షన్ 302 కింద కాకుండా సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు.