1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (20:50 IST)

#మహమ్మారి తెలంగాణలో మరొకరికి, స్కాట్లాండ్ వెళ్లొచ్చాడట, దేశంలో - 114

తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదైంది. దీనితో తెలంగాణలో ఇప్పటివరకూ వున్న కరోనా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి స్కాట్లాండ్ వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఇతడిని ఐసొలేషన్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. 
 
చైనాలో పుట్టిన కరోనా వైరస్ - COVID 19 ప్రపంచంలో ఇప్పటివరకూ 157 దేశాలకు వ్యాపించింది. చైనాలో దీని ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో అక్కడ క్రమంగా షాపులు తెరుచుకుంటున్నాయి. కానీ భారతదేశం పైన కరోనా పంజా విసురుతోంది. మరోవైపు ప్రపంచంలోని దేశాలలో ఇటలీ కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతోంది. నిన్న ఒక్కరోజే 350 మందికి పైగా ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. దీనితో ఇటలీలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
మన దేశం విషయానికి వస్తే ఆదివారం నాడు ఒక్కరోజే 11 మందికి కొత్తగా కరోనా వైరస్ అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. జనవరి 30 నుంచి మార్చి 16 వరకు మన దేశంలో 114 కేసులు నమోదవగా అందులో 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఇక 12 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణై ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వాలు కరోనా వైరస్ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.