మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎంజీ
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:43 IST)

Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు, కేరళలో 32వేల పైగా నమోదు

దిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న రెండు నెలల గరిష్ఠానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 45,352 కేసులు బయటపడ్డాయి. అంతక్రితం రోజు(47,092)తో పోలిస్తే 3.6శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అటు మరణాలు కూడా మళ్లీ 400 దిగువన ఉండటం ఊరటనిస్తోంది.
 
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇక నిన్న మరో 34,791 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3.20కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.45శాతంగా ఉంది. కొవిడ్‌ కారణంగా నిన్న మరో 366 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,895కు చేరింది.

మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య మళ్లీ 4లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,99,778 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.22 శాతానికి పెరిగింది. దక్షిణాది రాష్ట్రంలో కేరళను కరోనా పట్టిపీడిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో రెండొంతులు ఒక్క ఆ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. గురువారం అక్కడ 32,097 కేసులు వెలుగుచూడగా.. 188 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 74.84లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 67.09కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.