గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:48 IST)

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు - 3 జిల్లాల్లో లాక్డౌన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
గత 24 గంటల్లో మొత్తం 491 కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 390 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. కోవిడ్ కారణంగా కృష్ణాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒకరు మృతి చెందారు. స్థానికంగా ఉన్నవారిలో 138 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 
 
ఇకపోతే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో తాజాగా 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1506 మందికి పాజిటివ్ కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 647 మంది. డిశ్చార్జ్ అయినవారు 859 మంది. 
 
అలాగే, విదేశాల నుంచి వచ్చిన వారిలో తాజాగా 18 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 326 కేసులు నమోదు కాగా, 277 మంది చికిత్స పొందుతున్నారు.. 49 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇక జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో మొత్తం కేసులు 789, చిత్తూరులో 515, ఈస్ట్ గోదావరిలో 485, గుంటూరులో 742, కడపలో 330, కృష్ణలో 982, కర్నూలులో 1247, నెల్లూరులో 459, ప్రకాశంలో 175, శ్రీకాకుళంలో 59, విశాఖపట్టణంలో 261, విజయనగరంలో 78, వెస్ట్ గోదావరిలో 498 చొప్పున నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నమోదైన పాజిటివ్ కేసుల సంక్య 1506గా ఉంది. 

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ముఖ్యంగా, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో ఆదివారం నుంచి లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
అయితే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే కిరాణా సరకుల షాపులు తెరిచివుంచుతారు. అదేసమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేయనున్నారు.