దేశంలో కరోనా ఉధృతి.. ఏపీలోనూ అదే పరిస్థితి.. 136 కేసులు.. ఒకరు మృతి
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,12,29,398కి చేరింది. ఇందులో 1,08,82,798 మంది బాధితులు వైరస్‌నుంచి కోలుకున్నారు.
మరో 1,88,747 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 1,57,853 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనాతో 97 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 14,278 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించింది.
అలాగే ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో వైరస్ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,692కు చేరింది. ఇవాళ్టి వరకు 8,82,520 మంది కోలుకున్నారు.