సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్

శ్రీసిటీలో గోల్ఫ్ క్రీడా మైదానం ప్రారంభం - అత్యాధునిక సౌకర్యాలతో...

ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గోల్ఫ్ క్రీడా మైదానం శ్రీసిటీలో ప్రారంభమైంది. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసయుకి శనివారం సాయంత్రం దీనిని ప్రారంభించగా, ఇండియన్ గోల్ఫ్ యూనియన్ కోశాధికారి ఈశ్వర్ ఆచంత, ఎపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వీరారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పలు పరిశ్రమల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇందులో పాల్గొన్నారు. కాన్సుల్ జనరల్ లాంఛనంగా బంతిని కొట్టి గోల్ఫ్ క్రీడా మైదానం ప్రారంభమైనట్లు ప్రకటించారు.  
 
అతిథులకు సాదర స్వాగతం పలికిన రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడా వినోద వసతుల రూపకల్పనలో భాగంగా నేడు గోల్ఫ్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శ్రీసిటీలోని విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల ఉద్యోగులు, శ్రీసిటీ పరిధిలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ గోల్ఫ్ క్రీడను ఆడడం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆయన కోరారు. 
 
టగా మసయుకి మాట్లాడుతూ, జపాన్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను ఇక్కడ జపాన్ పరిశ్రమల ప్రతినిధులకు చేరువ చేసినందుకు శ్రీసిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార నగరంలో క్రీడా సదుపాయాలు నెలకొల్పడం మంచి పరిణామమన్న ఆయన, శ్రీసిటీలో సామాజిక వసతుల అభివృద్ధి విషయంలో యాజమాన్య కృషిని అభినందించారు.  
 
క్రీడలను ప్రోత్సాహం కోసం ప్రవేశపెట్టబడిన కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈశ్వర్ ఆచంత ప్రస్తావిస్తూ, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. శ్రీసిటీ కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ గోల్ఫ్ మైదానాలలో ఒకటిగా ఇది మారుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
 
ఏపీ ప్రభుత్వ సలహాదారు వీరారెడ్డి మాట్లాడుతూ, కేవలం పరిశ్రమలే కాకుండా క్రీడలు, వినోదంతో సహా అన్ని వసతులతో ఓ మంచి నివాస నగరంగా శ్రీసిటీని అభివృద్ధి చేస్తున్నందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు. 
 
గోల్ఫ్ క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీసిటీ కన్సల్టెంట్ ఎస్ పి శర్మ సమన్వయ భాద్యులుగా వ్యవహరించారు. ఆహ్లాదకర వాతావరణంలో 10 ఎకరాలలో విస్తరించి ఉన్న శ్రీసిటీ గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్‌ (గోల్డ్ క్రీడా మైదానం) లో గోల్ఫ్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికి, కొత్తవారు ప్రాథమిక శిక్షణ పొందడానికి  అవకాశం ఉంటుంది. అనుభవం కలిగిన గోల్ఫ్ కోచ్‌లు అందుబాటులో వుండి శిక్షణ ఇస్తారు.