1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 మే 2025 (20:04 IST)

దేశంలో వెయ్యి దాటిన కరోనా కొత్త కేసులు - కొత్త వేరియంట్లపై భయమా?

covid ward
దేశంలో కరోనా కొత్త కేసులు వెయ్యి దాటిపోయాయి. ఒకవైపు వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు, కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. కేన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
ముఖ్యంగా గతవారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్నాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలకమైన సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. 
 
ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం, ఇతర సంబంధిత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయని డాక్టర్ బహల్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేన్సర్ రోగులు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 1009 కరోనా వైరస్ క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. గతవారం వ్యవధిలో కొత్తగా 750 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది.