గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:14 IST)

పెరుగుతున్న చలి తీవ్రత - కరోనాతో తస్మాత్ జాగ్రత్త

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. శీతాకాలం అంటేనే అన్ని రకాల వైరస్ లు, ఇన్ఫెక్షన్లకు అనుకూలంగా ఉండేకాలం. గతం కంటే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. 
 
చలితీవ్రత పెరుగుతున్న కొద్దీ వైరస్ ప్రభావం పెరగవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
 
ముఖ్యంగా బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించడం, తరచూ సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు, రద్దీ ప్రదేశాల్లో ఉన్నపుడు భౌతిక దూరం వంటి ముఖ్యమైన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. 
 
ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాల్సిన అసవరం ఉంది. 
 
* చలి తీవ్రతతోపాటు తుపాన్ల కారణంగా చల్లని గాలులు ఎక్కువగా వీస్తుండడంవల్ల ఎక్కువ మంది జలుబు, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇది మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు అని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
* కరోనా వచ్చినపుడు ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ ను వినియోగిస్తారు. కాబట్టి శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతోపాటు ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది. ప్రస్తుతం చలి గాలికి బయటకు రావడంవల్ల వీరు నిమోనియా బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తులకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
* ఆస్తమా, మధుమేహం, టీబీ, హెచ్ఐవీలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారికి ఈ వాతావరణం అంత మంచిది కాదు. ఈ లక్షణాలున్నవారు చల్లని గాలులు వీస్తున్న సమయంలో బయటకు రాకపోవడం మంచిది. ఎందుకంటే జలుబు, వైరల్ జ్వరాల బారినపడి ఆస్పత్రులకు వెళ్తున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది.
 
* బయట ఎంత చల్లగా ఉన్నా ఏసీలను ఆన్ చేసుకుని ఉండడం చాలా మందికి అలవాటు. ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఏసీల వినియోగాన్ని తగ్గించడం మంచిది. అసరమైతేనే ఏసీలను వినియోగించండి. అవకాశం ఉన్నవారు ఉదయం వేళల్లో ఎండలో కొంతసేపు తప్పకుండా ఉండాలి. 
 
* కరోనా బారినపడినప్పుడు ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లూ, నిమోనియా వంటి రెండో దశ ఇన్ఫెక్షన్లకు వీరు త్వరగా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివారు అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే ఫ్లూ, నిమోనియా వ్యాక్సిన్లు వేసుకోవాలి. ముఖ్యంగా కరోనా వచ్చినవారు ఈ వ్యాక్సిన్లు ఏడాదికి ఒకసారి వేసుకోవాలి. 
 
* కళ్లు పచ్చబడుతున్నా, గుండె వేగం పెరుగుతున్నా, జ్వరం వచ్చివచ్చి వెళ్తున్నా తప్పనిసరిగా వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
 
* అసలే కరోనా కాలం. దీనికితోడు శీతాకాలం కావడంతో వాతవరణం కూడా చల్లగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వేడివేడిగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమైనది. సాధ్యమైనంత వరకు వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. వీలైనంత వరకు సూప్స్ రూపంలో తీసుకోవాలి. పండ్లను ఎక్కువగా తినాలి. గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
 
 
* పొడి దగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులు వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చాలి.
 
* కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతా గోరువెచ్చని నీటినే తాగాలి.
 
* తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాలి. 
 
* సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
 
* ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి.