ఐసీఎంఆర్ శాస్త్రవేత్తకు కరోనా : ఆంధ్రాలో మరో 76 కేసులు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన ఓ శాస్త్రవేత్తకు కరోనా వైరస్ పాజిటవ్ వచ్చింది. ముంబై నుంచి రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు నిర్వహించిన పరీక్షలో.. కోవిడ్19 పాజిటివ్ తేలినట్లు సమాచారం.
ముంబైలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ రీప్రొడెక్టివ్ హెల్త్‌లో ఆ సైంటిస్టు పనిచేస్తున్నారు. ఢిల్లీలోని ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. దీంతో ఢిల్లీ కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. అలాగే, ఆయన ఎవరెవర్ని కాంటాక్ట్ అయ్యారన్న దానిపై కూడా ట్రేసింగ్ జరుగుతున్నట్లు ఐసీఎంఆర్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,118కి చేరింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
కరోనా వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 64 మంది చనిపోయారు. సోమవారం వరకు 2169 మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 885 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరులో 8 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవారు కావడం గమనార్హం.