శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (09:07 IST)

ఏపీ మంత్రి ఇంట్లో కరోనా కలకలం : ముగ్గురికి పాజిటివ్.. మంత్రికి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. ఆ మంత్రి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఫలితంగా మంత్రితోపాటు మంత్రి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ నిర్ధారణ అయిన ముగ్గురు రోగులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మాలగుండ్ల శంకర్ నారాయణ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన.. బీసీ సంక్షేమ శాఖామంత్రిగా జగన్ మంత్రివర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఇటీవల మంత్రి అత్త అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. వైద్యులు ఎందుకైనా మంచిదని భావించి, మంత్రి కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా, ముగ్గురు పాజిటివ్ అని తేలింది. అయితే, అదృష్టవశాత్తు మంత్రి శంకర్ నారాయణకు మాత్రం నెగెటివ్ అని తేలింది. దీంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. 
 
అలాగే, మంత్రి కుటుంబ సభ్యులు నివసించే ధర్మవరంలోని సాయి నగర్‌ను కంటైన్మెంట్ జోనుగా అధికారులు ప్రకటించి, కఠినమైన ఆంక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతాన్ని శానిటైజ్, క్లోరినేషన్ చేయాల్సిందిగా స్థానిక యంత్రాంగాన్ని అధికారులు ఆదేశించారు.