మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన? హోం మంత్రి షా ఏమంటున్నారు?
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుపుటలకెక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోవడానికి ప్రధానంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనుభవా రాహిత్యమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ బీజేపీ నేత నారాయణ రాణే డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనదైనశైలిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
అదేసమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రతి రాష్ట్రమూ కరోనాను ఎదుర్కుంటేనే ఉందని, ఎవరో అద్భుతంగా పనిచేశారు, ఎవరు చేయలేదన్నది చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు.
కరోనాను కేంద్రం ఎదుర్కోవాలని, అలాగే రాష్ట్రం, ప్రతి మనిషీ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. అంతేగానీ... ఒక రాష్ట్రం బాగా పనిచేసిందని, మరో రాష్ట్రం బాగా పనిచేయలేదని చెప్పడం సరైన విధానం కాదని షా స్పష్టం చేశారు. అంతేకానీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుభవరాహిత్యం అనే విషయంపై తాను అస్సలు స్పందించబోనని తేల్చి చెప్పారు.