1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:36 IST)

ఢిల్లీపై కరోనా పంజా : ఆస్పత్రి పడకలన్నీ ఫుల్.. ఫుల్

దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసిరింది. ఒక్కసారిగా వేలాది మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున జనం హాస్పిటళ్లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కొరత సమస్య ఉత్పన్నమైంది. 
 
క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరో వైపు ఆక్సిజన్‌ బెడ్ల కొరత ఏర్పడుతున్నది. దీంతో చేసేది లేక వైద్యులు ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. 1,500 పడకలతో దేశంలోనే అతిపెద్ద కొవిడ్‌ సౌకర్యాల్లో ఒకటైన లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ)కి రోగులు భారీగా క్యూకడుతున్నారు.
 
కరోనా వైరస్ బారినపడినవారంతా అంబులెన్సులు, బస్సులు, ఆటోల్లో కూడా తరలివచ్చారు. కొత్తగా జన్మించిన శిశువుతో సహా వృద్ధుల వరకు వచ్చారు. అయితే హాస్పిటల్‌పై అధిక భారం ఉందని, ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు దవాఖాన డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. 
 
హాస్పిటల్‌లో ఉన్న పడకలు సరిపోవడం లేదని, గురువారం లోక్‌ నాయక్‌ హాస్పిటల్‌కు 158 కేసులు వచ్చాయని, దాదాపు అన్ని తీవ్రమైనవేనని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లు భారాన్ని పెంచుతున్నాయని, ప్రజలు మార్గదర్శకాలను పాటించడం లేదని, అజాగ్రత్తగా ఉన్నారన్నారు.
 
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
కుంభమేళాలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పవిత్ర స్నానాలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. కాగా మధ్యప్రదేశ్‌లోని మహా నిర్వాని అకారా సంస్థ అధిపతి స్వామి కపిల్‌ దేవ్‌ కరోనాతో మరణించారు.
 
కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు ఇటీవల పరీక్షలు నిర్వహించడంతో కరోనా బయటపడింది. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.