శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 21 మార్చి 2020 (15:54 IST)

11 వేల మంది మరణించారు, మనకు రాదులే అనే ధీమా వద్దు, జాగ్రత్త: WHO

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 50 వేల మంది “కోవిడ్‌-19” బారిన పడగా 11 వేల మంది మృతి చెందినట్లు “ప్రపంచ ఆరోగ్య సంస్థ” ( WHO)  ప్రకటించింది. మహమ్మారి “కరోనా” విషయంలో యువత నిర్లక్ష్య ధోరణి తగదని “ప్రపంచ ఆరోగ్య సంస్థ” హితవు పలికింది.

“కరోనా” బారిన పడుతున్న వారు.. ప్రాణాలు కోల్పోతున్నవారిలో వయసుపైబడిన వారే అధికంగా ఉన్నప్పటికీ యువత అతీతం కాదని ప్రకటించింది. కరోనాను తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ హెచ్చరిక జారీ చేశారు.

“కరోనా” ఎదుర్కోవాలంటే.. రెండు జనరేషన్లవారు సంఘీభావంతో పనిచేయాలని, అప్పుడే వైరస్‌ను ధీటుగా ఎదుర్కోవచ్చని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేసింది.
 
వైరస్‌కు మీరు అతీతులు కాదు. వైరస్‌ మమ్మల్ని ఏమీ చేయలేదనే భావనలో ఉండొద్దు. అది మిమ్మల్ని కొన్ని వారాలపాటు ఆస్పత్రిలో ఉంచొచ్చు. లేదంటే ప్రాణాలే తీయొచ్చు. మీకు అనారోగ్యంగా లేకపోయినా.. ఎక్కడపడితే అక్కడకు తిరగొద్దు. ఇతరుల ప్రాణాలను రిస్కులో పెట్టొద్దు, అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది.
 
తీవ్ర అనారోగ్య​ సమస్యలతో బాధ పడుతున్నవారికి వైరస్‌ సోకితే.. పరిస్థితి విషమంగా మారే వీలుంది. పొగ తాగేవారికి వైరస్‌ సోకితే తీవ్ర పరిణామాలను కూడా WHO హెచ్చరికలు జారీ చేసింది. సామాజిక దూరాలు కాకుండా ప్రజలంతా భౌతిక దూరాలు పాటించాలని సూచించింది.