ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 : తటస్థ వేదికలపై భారత్ మ్యాచ్‌లు .. సమ్మతించిన పాక్
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లరాదని భారత్ నిర్ణయించింది. అదేసమయంలో టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నింటినీ తటస్థ వేదికలపై నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించింది. ఇందుకోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను తటస్థ వేదికగా ఎంచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికగా యూఏఈని పీసీబీ ఎంచుకుందని బోర్డు అధికార ప్రతినిధి అమీర్ మీర్ ఐఏఎన్ఎస్ కి ఒక ప్రకటనలో తెలిపారు.
'తటస్థ వేదిక నిర్ణయం గురించి పీసీబీ అధికారికంగా ఐసీసీకి తెలియజేసింది. భారత్, పాకిస్థాన్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికపై ఆతిథ్య పాకిస్థాన్ నిర్ణయం తీసుకోవలసి ఉండగా.. ఆదివారం నాడు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) హెడ్ షేక్ అల్ నహ్యాన్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం తర్వాత తటస్థ వేదికపై తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది' అని అమీర్ మీర్ పేర్కొన్నారు.
కాగా, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027 వరకు జరగబోయే ఐసీసీ ఈవెంట్లలో కూడా భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచులన్నీ తటస్థ వేదికలపై జరుగుతాయని ఇటీవల ఐసీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (భారత్ ఆతిథ్యం), ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం)తో సహా 2028లో జరిగే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ (పాకిస్థాన్ ఆతిథ్యం) తటస్థ వేదికలలోనే జరగనున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను ఫిబ్రవరి-మార్చిలలో ఆడాల్సి ఉంది. త్వరలోనే టోర్నమెంట్ షెడ్యూల్ను ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.