ఇష్టం లేకుంటే మా దేశానికి రావొద్దు.. పాక్‌కు భజ్జీ చురక
పాకిస్థాన్‌కు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చురక అంటించారు. తమ దేశానికి రావడం ఇష్టం లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ రావొద్దని హితవు పలికారు. వచ్చే యేడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సివుంది. అయితే, పాక్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. దీంతో భారత్ ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో మరో వేదికపై నిర్వహించేందుకు ఐసీసీతో పాటు పాకిస్థాన్ కూడా సిద్ధమైంది.,
అదేసమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లబోమని.. ఆ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దని, ఇందులో తమకెలాంటి బాధ లేదని పేర్కొన్నాడు.
'మీకు ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దు. ఈ విషయంలో మాకు ఎలాంటి బాధ లేదు. పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మీరు ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు. పాక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటే ఈ విషయంలో భారత్ వైఖరి వేరేవిధంగా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి టోర్నమెంట్‌ను జరగనివ్వండి. మీరు దానిని ఆపలేరు. మలేసియా, శ్రీలంకతోపాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు భారత జట్టు అక్కడ పర్యటించదు' అని హర్భజన్ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అదేవిధంగా గతంలో తాను క్రికెట్ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్‌లో పర్యటించిన సందర్భాలను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 'నేను అక్కడికి వెళ్లినప్పుడు వారు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. మేము బయటికి వెళ్లి భోజనం చేసిన ప్రతిసారి వారు డబ్బులు తీసుకోలేదు. కొందరు మాకు శాలువాలు కూడా బహుమతిగా ఇచ్చారు' అని హర్భజన్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్ల ఆటను పాక్ అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నాడు. అయితే, ఇందులో పాక్ అభిమానుల తప్పేమీ లేదన్నాడు. అక్కడ పరిస్థితి మెరుగుపడేవరకు ఇలానే ఉంటుందని భజ్జీ వివరించాడు.