బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (12:21 IST)

భారత మహిళా క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ.. ఆవిష్కరించిన జై షా!

new odi jersey
భారత మహిళా క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రవేశపెట్టింది. ఈ జెర్సీని జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బీసీసీఐ సెక్రటరీ జై షాలు తాజాగా ఆవిష్కరించారు. ఈ జెర్సీ ముందు, వెనుక దాదాపు పాతవాటిలాగే ఉండగా, భుజాల మీద మాత్రం త్రివర్ణ పతాక రంగులుండటంతో ప్రత్యేకంగా ఆకర్షణగా కనిపిస్తుంది. 
 
హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు డిసెంబరు 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భారత అమ్మాయిలు ఈ కొత్త జెర్సీలోనే బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత డిసెంబరు 22 నుంచి వడోదరలో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా మహిళల జట్టు కొత్త జెర్సీని ధరించనుంది.
 
ఈ జెర్సీలను ఆవిష్కరించిన తర్వాత కెప్టెన్ కౌర్ మాట్లాడుతూ, 'ఈరోజు జెర్సీని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాం. జెర్సీ లుక్ చాలా బాగుంది. భుజాల మీద త్రివర్ణ పతాక రంగు చాలా అందంగా ఉంది. మాకు ప్రత్యేకమైన వన్డే జెర్సీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. 
 
టీమిండియా జెర్సీని ధరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని హర్మన్ ప్రీత్ అన్నారు. దానిని సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భారత అభిమానులు కూడా ఈ జెర్సీని ధరించి గర్వపడాలని కోరారు.