శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (15:11 IST)

సిడ్ని టెస్ట్ : తేలిపోయిన భారత బౌలర్లు - తొలి రోజు కంగారులదే పైచేయి

భారత్ - ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ గురువారం సిడ్నీ క్రికెట్ మైదానంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పటిష్టమైన స్థితిలో నిలించింది. భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి, పటిష్టస్థితిలో నిలిచింది. 
 
 
యువ ఓపెన‌ర్ విల్ పుకోస్కీ (62: 110 బంతుల్లో 4 ఫోర్లు), మార్న‌స్ ల‌బుషేన్ ‌(67 నాటౌట్‌: 149 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ఆసీస్ భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. స్టార్ బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్‌ (31 బ్యాటింగ్ 64 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజులో కుదురుకున్నాడు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (5) స్వ‌ల్ప స్కోరుకే మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. అయితే పుకోస్కీ, ల‌బుషేన్ రెండో వికెట్‌కు 100  ప‌రుగులు జోడించడంతో ఆసీస్ కుదురుకున్న‌ది. 
 
అర్థశ‌త‌కం సాధించిన అనంత‌రం పుకోస్కీ అవుట‌య్యాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన పుకోస్కీ స్ఫూర్తిదాయ‌క ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. న‌వ‌దీప్ సైనీ ఓపెన‌ర్ విల్‌ను పెవిలియ‌న్ పంపిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన స్మిత్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. 
 
ఆఖ‌రి సెష‌న్‌లో ల‌బుషేన్‌, స్మిత్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు వీరిద్ద‌రూ 60 ప‌రుగులు జోడించారు. కుదురుకున్న జోడీని విడ‌దీసేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం లేక‌పోయింది. 
 
చివ‌ర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచుతూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే వ‌ర్షం కుర‌వ‌డంతో  తొలి రోజు కేవ‌లం 55 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. రిష‌బ్ పంత్ పేల‌వ వికెట్ కీపింగ్‌తో విలువైన క్యాచ్‌ల జార‌విడిచాడు. రెండు అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్న పుకోస్కీ హాఫ్‌సెంచ‌రీతో విజృంభించాడు.