మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (17:39 IST)

తొలి టెస్ట్.. చేతులెత్తేసిన భారత్.. రెండో రోజు కివీస్‌దే పైచేయి...

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేవలం 165 పరుగులకే కుప్పకూలారు. తొలిరోజు రోజు టాపార్డర్ విఫలమైతే.. రెండో రోజు మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబాటు కొనసాగింది. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కివీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. దీంతో 51 పరుగులు ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
 
ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (89) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, వందో టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (44) రాణించాడు. ఓపెనర్ టామ్ లాథమ్ (11)ను ఇషాంత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చినా.. మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ (30), టేలర్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 
 
నిజానికి కివీస్ జోరుకు భారత బౌలర్లు ఓ దశలో బ్రేక్ వేశారు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసి పుంజుకున్నారు. టేలర్‌ను ఔట్ చేసిన ఇషాంత్ మూడో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసి బ్రేక్ ఇవ్వగా.. విలియమ్సన్‌‌ను ఇషాంత్, నికోల్స్ (17)ను అశ్విన్ వెనక్కు పంపారు. ప్రస్తుతం బీజే వాట్లింగ్ (14 బ్యాటింగ్), గ్రాండ్ హోమ్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇషాంత్ కు మూడు, షమీ, అశ్విన్ కు ఒక్కో వికెట్ దక్కింది.
 
అంతకుముందు భారత్ తన ఓవర్ నైట్ స్కోరు 122/5 కలిసి శనివారం ఆటను కొనసాగించింది. రెండో రోజున భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 68.1 ఓవర్లో 165 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలింగ్ ధాటికి 13 ఓవర్లలోనే మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 
 
ఆట మొదలైన వెంటనే రిషబ్ పంత్ (19) రనౌటవగా.. అశ్విన్ (0) గోల్డెన్ డకౌటయ్యాడు. అతడిని  సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మహ్మద్ షమీ (21) సహకారంతో ఒక్కో పరుగు జోడిస్తూ హాఫ్ సెంచరీకి చేరువైన అజింక్యా రహానే (46)ను కూడా సౌథీనే వెనక్కు పంపాడు. 
 
ఆపై, వరుస ఓవర్లలో ఇషాంత్  (5)ను జెమీసన్, షమీని సౌథీ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో జెమీసన్, సౌథీ  చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా భారత్‌పై కివీస్ ఆధిపత్యం సాధించింది.