భారత్ పాకిస్థాన్ హై-ఓల్టేజ్ మ్యాచ్‌కు కేంద్రం పచ్చజెండా
క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. పైగా, తటస్థ వేదికలపై పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలపై తమ కేంద్రం తమ వైఖరిని స్పష్టం చేస్తూ కొత్త క్రీడా విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. దీంతో వచ్చే నెల యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీలో దాయాదుల పోరుకు మార్గం సుగమమైంది.
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ విధాన ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది. పాకిస్థాన్‌తో మాత్రం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
భారత జట్లు పాకిస్థాన్‌లో పర్యటించవు. అలాగే, పాకిస్థాన్ జట్టు భారత్‌లో ఆడేందుకు అనుమతించం. అని క్రీడా మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయ క్రీడా సంస్థలు నిర్వహించే బహుళ జట్ల టోర్నమెంట్ల విషయంలో ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
భారత్ లేదా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల విషయంలో, అంతర్జాతీయ క్రీడా సమాఖ్య నిబంధనలకు మన క్రీడాకారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. దీని ప్రకారం పాకిస్థాన్ జట్లు లేదా క్రీడాకారులు పాల్గొనే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత జట్లు, క్రీడాకారులు కూడా పాల్గొంటారు. అలాగే, భారత్ ఆతిథ్యమిచ్చే ఇలాంటి టోర్నీలలో పాక్ జట్టు కూడా పాల్గొనవచ్చు అని వివరించింది.