మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని ఆటతీరుతో భారత జట్టును విజయం వైపు నడిపించాడు. ఆదివారం పరుగుల వరద పారిన పుణే వన్డే పోటీలో భారత జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలివన్డేలో అక్షరాలా పరుగుల వరద పారింది. జాదవ్ వీర విహారానికి, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఓ దశలో ఓటమి అంచుల వరకు వెళ్లిన భారత్, ఇంగ్లండ్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ శిఖర ధావన్, కె.ఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, ధోనీ త్వరత్వరగా ఔటై 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆశలు వదిలేసుకున్న క్షణంలో భారత జట్టు పడి లేచిన కెరటంలా నిలదొక్కుకుంది.
కేప్టెన్ విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయక మైన ఆటతో సెంచరీ సాధించగా కేదార్ జాదవ్ ఉరుములూ, మెరుపులూ లేకుండానే పిడుగులు కురిసిన చందాన ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. ఎంతగానంటే చాలా కాలం తర్వాత రన్ రేట్‌లో కోహ్లీయే వెనుకబడిపోయాడు. జాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అతడికే ఎక్కువసేపు స్ట్రయికింగ్ ఇచ్చిన కోహ్లీ వన్డే జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయమైన విజయం అందుకున్నాడు. చివరి రెండు బంతుల్లో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ వరుస బంతుల్లో చెరో సిక్సర్ బాది భారత విజయానికి సొగసులద్దారు.
ఆదివారం పుణెలో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్, భారత్ ఎదుట 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక దశలో దాదాపు 400 పరుగులు కూడా చేస్తుందనుకున్న ఇంగ్లండ్‌ను 35-45 ఓవర్ల మధ్య హార్దిక్ పాండ్యా డాట్ బాల్స్‌తో అడ్డుకున్నాడు. హార్దిక్ మినహా భారత్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మని చుక్కలు చూపించారు.
కాగా, భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్ రాహుల్ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్ బాల్ ఓవర్లో ధోనీ పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కేదార్ జాదవ్, విరాట్ కోహ్లీతో కలిసి ఇంగ్లీష్ బౌలర్ల భరతం పట్టారు. కీలక సమయంలో జాదవ్ 120 పరుగులు(76 బంతుల్లో,12ఫోర్లు, 4సిక్సులు) మెరుపు సెంచరీకి తోడు, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 122 పరుగులు(105 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగాడు.
కోహ్లీకి వన్డేల్లో 27వ సెంచరీ కాగా, జాదవ్ కిది రెండో శతకం. 12 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ను విరాట్, జాదవ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం దిశగా నడిపించారు. స్టోక్స్ బౌలింగ్లో విరాట్ క్యాచ్ అవుటయ్యాడు. జట్టు 291 పరుగుల వద్ద జాదవ్ దూకుడుగా ఆడబోయి జేటీ బాల్ బౌలింగ్లో స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా(13) నిరాశ పరిచినా పాండ్యా(40), అశ్విన్(15) సమయోచితంగా ఆడటంతో భారత్ తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. చివరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 70 వరకు పరుగులు చేసే అవకాశముందని భావించారు. భారత బౌలర్లు రాణిస్తే 300 స్కోరుకు కాస్త అటూ ఇటుగా ఇంగ్లండ్‌ను కట్టడి చేయవచ్చని ఊహించారు. అయితే సీన్ రివర్సయింది. చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇరగదీశారు. దీంతో మ్యాచ్ టీ-20లా సాగింది.
చివర్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ధారాళంగా పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నాలుగు సిక్సర్లు, ఫోర్ బాదారు. ఇక ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టారు. అశ్విన్ కూడా ఓ ఓవర్లో 4, 6 సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. పూర్తి ఓవర్లు అయ్యే సరికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 350 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. చివర్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు.
ధోనీ పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్ బాధ్యతలనుంచి తప్పుకున్నాక జరిగిన తొలి వన్డేలోనే విజయం సాధించిన విరాట్ కోహ్లీ.. ధోనీ చెప్పినట్లే కొత్త శకాన్ని ప్రారంభించాడు. భారత్ రికార్డు స్థాయిలో ఛేదనలో గెలుపు సాధించడం ఇది మూడోసారి. వన్డే చరిత్రలో పది రికార్డు స్థాయి ఛేదనల్లో మూడు భారత్ పేరిట నమోదు కావడం విశేషం. నాలుగు వికెట్లు టపాటపా రాలిపడిన క్షణంలో కూడా ప్రత్యర్థికి తాను వెన్ను చూపకుండా, సహచరులలో స్ఫూర్తి నింపి జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలో కొత్త శకాన్ని అద్వితీయంగా మొదలెట్టాడు.