మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (12:19 IST)

Vaibhav Suryavashi : అమ్మ 3 గంటలే నిద్రపోయేది.. తల్లిదండ్రుల వల్లే ఈ స్థాయికి: వైభవ్ సూర్యవంశీ (video)

Vaibhav Suryavashi
Vaibhav Suryavashi
రాజస్థాన్ రాయల్స్ యువ అద్భుత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు తాను సాధించిన విజయానికి తన తల్లిదండ్రులే కారణమని చెప్పాడు. 18వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించిన సమయంలో 14 ఏళ్ల సంచలనం సూర్యవంశీ బౌండరీలు, దూకుడు ప్రదర్శనతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
 
అయితే, సూర్యవంశీ విజయానికి మార్గం అంత తేలికగా రాలేదు. అతను ఇప్పటివరకు సాధించిన విజయ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు చేసిన అనేక ప్రయత్నాలను అతను వెల్లడించాడు. అతని తల్లి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు ఉదయం లేచి అతనికి ఆహారం సిద్ధం చేయడం, అతని తండ్రి తన కొడుకు ఆటపై దృష్టి పెట్టడానికి తన పనిని వదిలి వెళ్ళేవారని చెప్పాడు. 

 
"నేను ఈ రోజు ఏ స్థితిలో ఉన్నా, నా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉన్నాను. నేను ప్రాక్టీస్‌కు వెళ్లవలసి వచ్చినందున నా తల్లి త్వరగా మేల్కొనేది. ఆమె నాకు ఆహారం సిద్ధం చేసేది. ఆమె మూడు గంటలు నిద్రపోయేది. క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకున్న కొంత భూమిని కూడా నాన్న అమ్మేశారు. నా తండ్రి నా కోసం తన పనిని వదిలిపెట్టాడు. నా పెద్ద అన్నయ్య ఇప్పుడు తండ్రి పనిని కొనసాగిస్తున్నాడు. అలా నా తండ్రి నాకు మద్దతు ఇచ్చాడు. ఈ రోజు నేను సాధించిన విజయం నా తల్లిదండ్రుల వల్లనే" అని వైభవ్ ఎక్స్ ద్వారా తెలిపాడు.
 
కాగా.. 14 ఏళ్లకే ఐపీఎల్‌ అరంగేట్రంతో ఆశ్చర్యపరిచి.. తొలి బంతినే సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) తన మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 
 
ప్రస్తుతం వైభవ్.. బీహార్‌, తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదవుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్‌కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్ మీడియాకు తెలిపారు.
 
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్‌లో సూర్య వంశీ సెంచరీ సాధించి తొలి సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో బిహార్ తరఫున రంజీ ట్రోఫీ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత బిహార్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు.