ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జులై 2024 (12:25 IST)

కుమారుడితో కలిసి సెర్బియాకు వెళ్లిపోయిన హార్దిక్ పాండ్యా సతీమణి

hardik pandya - natasha
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా తన కుమారుడితో కలిసి సెర్బియాకు వెళ్లిపోయింది. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె తన కుమారుడితో కలిసి సెర్బియాకు వెళ్ళిపోవడంతో పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టయింది. 
 
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది. ఈ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు లంకతో వన్డేలకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడట. ఇదిలావుంటే హార్దిక్ పాండ్య సతీమణి నటాషా స్టాంకోవిచ్‌, కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబై నుంచి సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నటాషా తన ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది. లాగేజీతో కూడిన ఫొటోకు ‘ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ కన్నీళ్లతో కూడిన ఎమోజీ, విమానం, ఇల్లు, హార్ట్ సింబల్‌ ఎమోజీని షేర్ చేసింది. మరో ఫొటోలో ఆమె తన పెంపుడు కుక్క చిత్రాన్ని పంచుకుంది. హార్దిక్ పాండ్య, నటాషా విడిపోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భార్యతో విడాకులు తీసుకోవడం కోసమే హార్దిక్ శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతోంది. వన్డే సిరీస్ కంటే ముందే జరిగే టీ20 సిరీస్‌లో మాత్రం హార్దిక్ ఆడే అవకాశాలున్నాయి. కొంతకాలంగా టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను లంకతో పొట్టి సిరీస్‌కు సారథిగా ఎంపిక చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.