నిరుద్యోగులుగా మారనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఎందుకు?
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారనున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి వారి ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా మారిపోనున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర క్రికెటర్లు మ
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారనున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి వారి ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా మారిపోనున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర క్రికెటర్లు మానసికంగా కూడా సిద్ధపడిపోయారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏంటి.. నిరుద్యోగులుగా మారిపోవడం ఏంటనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనం చదవండి.
తమతో పాటు దేశంలో క్రికెట్ అభివృద్ధికి అవసరమైన కనీస అవసరాలను కల్పించాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే, బోర్డు ఆదాయంలో కొంత వాటాను తమకు ఇవ్వాలని ప్లేయర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే క్రికెట్ అభివృద్ధికి కిందిస్థాయిలో అవసరమైనంత నిధులు కేటాయించలేమని సీఏ వాదిస్తున్నది.
ఇదే అంశంపై ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (క్రికెట్ బోర్డు)కి మధ్య గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఇప్పటివరకు సఫలం కాలేదు. పైగా, మున్ముందు కూడా వీరిమధ్య ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం లేదు. అదేసమయంలో ప్రస్తుత ఒప్పందం ఈనెలాఖరుతో ముగియనుంది.
అదేసమయంలో జులై 1 నుంచి ఆసీస్ క్రికెటర్ల కొత్త కాంట్రాక్టులు ప్రారంభంకావాల్సి ఉంది. అయితే ఆలోపు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ), క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య ఓ ఒప్పందం కుదరడం దాదాపు అసాధ్యమని ఏసీఏ బాస్ గ్రెగ్ డయ్యర్ స్పష్టంచేశాడు. దీంతో నిరుద్యోగులుగా కావడానికి ప్లేయర్స్‌ను మానసికంగా సిద్ధం చేశామని డయ్యర్ చెప్పాడు. జులై 1న 200 వరకు టాప్ ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదిలావుండగా, గత శుక్రవారం మరో ప్రతిపాదనతో సీఏ ముందుకు వచ్చినా.. ప్లేయర్స్ నిరాకరించారు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే.. బంగ్లాదేశ్ టూర్, ఆ తర్వాత భారత్‌తో వన్డే సిరీస్, ఏడాది చివర్లో జరగాల్సిన యాషెస్ సిరీస్ జరగడం కూడా అనుమానంగా మారింది.