గురువారం, 21 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 మే 2024 (13:09 IST)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : అమెరికా జట్టులో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు!!

icc world cup
జూన్ నెలలో మరో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. తాజాగా ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా కూడా 15 మంది ఆటగాళ్ళతో జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లే సగం మంది ఉన్నారు. 
 
కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటుదక్కింది. అలాగే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరే అండర్సన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అండర్సన్ కివీస్ తరపున 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఆడిన విషయం తెలిసిందే. మిగిలిన ప్లేయర్లలో ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఎస్ టేలర్, జెస్సీ సింగ్, కెంజిగే, షాల్క్ విక్, ఆండ్రీస్ గౌస్, జహంగీర్, అలీఖాన్, నితీశ్ కుమార్‌లు ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా గజానంద్, డ్రైసేల్, యాసిర్ చోటుకల్పించింది. 
 
కాగా, యూఎస్ క్రికెట్ జట్టు డల్లాస్‌లో కెనడాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 6వ తేదీన పాకిస్థాన్‍తో, జూన్ 12న భారత్‌తో తలపడనుంది. అలాగే ఈ టోర్నీలో తన చివరి మ్యాచ్‌ను జూన్ 14న ఫ్లోరిడాలో ఐర్లాండ్ ఆడనుంది. ఇదిలావుంటే.. ఈసారి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.
 
2024 ఐసీసీ టీ20 కోసం అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, నోష్టుష్ కేంజిగే, సౌరభ్ నేత్రల్వాకర్, షాడ్లీ వాన్ షాలివిక్, స్టీవెన్ టేలర్, షాయ జహంగీర్, రిజర్వ్ ఆటగాళ్లు. జువానో డ్రైసేల్, గజానంద్ సింగ్, యాసిర్ మహ్మద్.