శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 9 జూన్ 2017 (08:15 IST)

దూకుడుతోనే గేమ్ గెల్చుకున్న లంక.. కళ్లముందే విజయాన్ని చేజార్చుకున్న భారత్

బుధవారం ప్రపంచ నంబర్ వన్ జట్టు ప్రపంచ క్రికెట్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు చేతిలో దిగ్భ్రాంతికరంగా ఓడిపోయింది. గురువారం ప్రపంచ నంబర్ టూ జట్టు ఏడవ స్థానంలో ఉన్న జట్టు చేతిలో మట్టిగరించింది. వన్డే క్రికెట్‌లో అద్భుతాలు ఎలా జరుగుతాయో చూపడానికి ఈ రెండ

బుధవారం ప్రపంచ నంబర్ వన్ జట్టు ప్రపంచ క్రికెట్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు చేతిలో దిగ్భ్రాంతికరంగా ఓడిపోయింది. గురువారం ప్రపంచ నంబర్ టూ జట్టు ఏడవ స్థానంలో ఉన్న జట్టు చేతిలో మట్టిగరించింది. వన్డే క్రికెట్‌లో అద్భుతాలు ఎలా జరుగుతాయో చూపడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టును ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ డక్ వర్త్ లూయిస్ సాక్షిగా ఓడించి పాయింట్లు గెల్చుకోగా, నంబర్ టూ స్థానంలో ఉన్న భారత్‌ను ఏడవ స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు అనితర సాధ్యమైన రీతిలో పరాభవానికి గురి చేసింది. 
 
ముఖ్యంగా దుర్భేద్యమైన బ్యాటింగ్, భీకరమైన బౌలింగ్ వనరులను కలిగి ఉన్న భారత్ విసిరిన 321 పరుగులను 3 వికెట్ల నష్టానికి అలవోకగా  ఛేదించిన శ్రీలంక జట్టు భారత అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. అంతకంటే మించి భారత బౌలింగ శ్రేణిని ఒక ఆటాడుకుంది. టీమిండియా వంటి శక్తివంతమైన జట్టును ఓడించటం కష్ట సాధ్యమన్న శ్రీలంక కేప్టెన్ తన కల్లో కూడా మరవనేలి చందంగా భారత బౌలర్లకు ఎదురొడ్డి మరీ జట్టును గెలిపించాడు. తొలినుంచి దూకుడుగా ఆడకపోతే భారత్‌పై విజయాన్ని మర్చిపోండి అంటూ లంక వెటరన్ క్రికెటర్ కుమార సంగాక్కర చేసిన హెచ్చరికను లంక జట్టు అక్షరాలా అమలు చేసింది. 
 
ఒకరకంగా ఈ పరాజయం ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీ ఫేవరైట్‌గా భావిస్తున్న టీమిండియాకు మేలుకొలుపు లాంటిది. అప్రతిహత విజయాల పరంపరలో సాగిపోతున్న టీమిండియాను ఒక్కసారిగా నేలకు దింపిన పరాజయమిది. తాము ఫేవరైట్లం అనే గర్వాతిశయంతో ఎన్నడూ మైదానంలోకి దిగకూడదని, రెండు ఓవర్లు ఏమరుపాటుగా ఉన్నా, అలసత్వం ప్రదర్శించినా విజయం చేజారిపోతుందన్న గొప్ప సత్యాన్ని ఈ పరాజయం చాటి చెప్పింది. 
 
ఆటమీద దృష్టి పెట్టకుండా జట్టు వైఖరిపై కఠినంగా ఉన్నాడన్న సాకుతో కోచ్ మీద కారాలు మిరియాలు మీరి వీధులకెక్కే కుర్రకుంక చేష్ట్యలను మాని టీమిండియా, ముఖ్యంగా జట్టు కేప్టెన్ కాస్త ఆట మీదే దృష్టి సారిస్తే మంచిదని ఈ పరాజయం మంచి గుణపాఠం నేర్పించింది. 
 
డక్ వర్త్ లూయిస్ పుణ్యమా అని పాక్ చేతిలో అనూహ్యంగా ఓటమికి గురికావల్సి వచ్చిన దక్షిణాఫ్రికా చావోరేవో తేల్చుకోవడానికి భారత్ పని పడతానని హెచ్చరించిన నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు రంగాల్లోనూ అప్రమత్తంగా వ్యవహించకపోతే టీమిండియా ఐసీసీ చాంపియన్స్ టోర్నీ వదులుకోవలిసిందే.