మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (13:53 IST)

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

knife
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. బిడ్డకు నామకరణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ఆ బిడ్డ తండ్రి హత్యకు గురయ్యాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. 
 
పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని తలుపుల మండలానికి చెందిన శ్రీకాంత్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దాడిలో మరణించాడు. శనివారం అర్థరాత్రి దాదాపు 12.30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. బ్యాంకు రుణం ఇప్పించినందుకు ఇచ్చే కమిషన్‌లో తలెత్తిన వివాదంలో రాజారాం అనే వ్యక్తి కత్తితో శ్రీకాంత్ అనే టెక్కీ తొడపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. 
 
శ్రీకాంత్ బావమరిది అయిన అనిరుధ్ బ్యాంకుల్లో రుణం ఇప్పించే ఏజెంటుగా పని చేస్తున్నాడు. బలిజపేటకు చెందిన శోభ అనే మహిళకు రుణం ఇప్పించాలని రాజారాం, ఆమెను అనిరుధ్‌కు పరిచయం చేశాడు. ఆ రుణం మంజూరైన తర్వాత తనకు కమిషన్ ఇవ్వాలంటూ రాజారాం పట్టుబట్టాడు. ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజారాం.. అనిరుధ్ ఇంటికి వెళ్లి అతని ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు.
 
ఈ విషయం తెలుసుకున్న అనిరుధ్, అతని తండ్రి శ్రీనివాసులు, బావమరిది శ్రీకాంత్‍‌తో కలిసి రాజారాంను నిలదీసేందుకు అతని ఇంటికి వెళ్లారు. అయితే, తనపై దాడికి వస్తున్నారనే భయంతో రాజారాం ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. ఈ గొడవలో అనిరుధ్, శ్రీనివాసులు కూడా గాయలయ్యాయి. ఘటన అనంతరం ప్రధాన నిందితుడు రాజారాం పరారీలో ఉండగా అతని సహకరించారన్న ఆరోపణలపై తండ్రి వెంకటరాయప్ప, తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లిడంచారు.