ముంబైలో ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పద మృతి
ముంబైలోని తన ఫ్లాట్‌లో ఓ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె రక్తపు మడగులో విగతజీవిగా పడివుండటం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన రూపాల్ ఓగ్రే అనే 25 యేళ్ల యువతి ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఈ ఏప్రిల్లోనే ముంబైకు మకాం మార్చారు. అంధేరీలోని ఓ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్లో తన సోదరి, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే వాళ్లిద్దరూ తమ గ్రామానికి వెళ్లడంతో ఒక్కరే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రూపాల్ కుటుంబ సభ్యులు ఎంతగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ముంబైలోని ఆమె స్నేహితులకు కాల్ చేసి ప్లాట్కు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆమె ఫ్రెండ్స్ ప్లాట్‌కు వచ్చి చూడగా, లోపలి నుంచి తాళం పెట్టి ఉంది. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో రూపాల్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు.
అయితే, ఈ కేసులో 40 ఏళ్ల వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రధాన నిందితుడిగా భావించి అరెస్టయిన విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తి అదే హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తుంటాడని.. అయితే, కొద్ది రోజుల క్రితం రూపాలు, అతడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీస్ డిప్యూటీ కమిషనర్ దత్తా నల్వాడే మాట్లాడుతూ.. రూపాల్ ఓగ్రే గొంతుపై నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేసినట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమికంగా వైద్యులు చెప్పలేదన్నారు. ఈ కేసును సాధ్యమైనంతగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.