సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (16:01 IST)

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

murder
దేశ రాజధాని ఢిల్లీలోని ఫరీదాబాద్‌‍లో దారుణం జరిగింది. భార్యా భర్తల వివాదం కారణంగా ఓ అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సొంత కుమార్తెను హత్య చేసిన తల్లి మృతదేహాన్ని కూడా ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ విషయం మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యతో విభేదాల నేపథ్యంలో దాదాపు 10 నెలలుగా కన్నకూతురి జాడ తెలియకపోవడంతో ఓ తండ్రికి అనుమానం వచ్చింది. సౌదీ అరేబియాలో ఉంటున్న అతడు అక్కడి నుంచే ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తులో ఆ వ్యక్తి కూతురు చనిపోయిందని గుర్తించారు. సొంత ఇంట్లోనే ఆమెను పాతిపెట్టారని కనుగొన్నారు. పాతి పెట్టింది కూడా కన్నతల్లేనని తేల్చాడు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి అనుకొని ఉండే ఫరీదాబాద్‌లో వెలుగులో చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మృతురాలి పేరు ఫర్వీనా. ఆమె 17 ఏళ్లని పోలీసులు వెల్లడించారు. తల్లి అనితా బేగంను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. జూన్ 7న తమకు ఈ-మెయిల్ ఫిర్యాదు వచ్చిందని, ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించగా తన భార్యతో సత్సంబంధాలు లేవని అతడు చెప్పాడని వివరించారు.
 
కాగా ఫర్వీనాను తాను హత్య చేయలేదని తల్లి అనితా బేగం చెబుతోంది. ఫర్వీనా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పింది. అయితే ఇంట్లో పాతిపెట్టింది తానేనని ఆమె అంగీకరించింది. ఫర్వీనాకు ఇతరులతో సంబంధాలు ఉండేవని, ఇంటి నుంచి పారిపోతుండేదని, ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచానని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. 
 
ఇక కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే భయంతో ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు వివరించింది. చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఆమెను ఇంట్లోనే పాతిపెట్టడం తాను చేసిన పెద్ద తప్పు అని అనితా బేగం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి విచారణ మొదలు పెడతామని పోలీసులు తెలిపారు.