సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (12:24 IST)

ఒకే ఇంట్లో ఐదు అస్థిపంజరాలు... కర్నాటకలోని చిత్రదుర్గలో ఘటన

skeleton
కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలోని ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు వెలుగు చూశాయి. గత 2019లో చివరి సారి కనిపించిన ఓ కుటుంబ సభ్యులంతా ఇపుడు అస్థిపంజరాలుగా బయటపడ్డారు. అయితే, వీరిని ఎవరైనా హత్య చేశారా లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పైగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిని ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి (85), ఆయన భార్య ప్రేమ (80), కుమార్తె త్రివేణి (62), కుమారులు కృష్ణ (60), నరేంద్ర (57)గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత కానీ వారి మృతికి గల ఖచ్చితమైన కారణం చెప్పలేమని పోలీసులు తెలిపారు. వీరు చివరిసారి 2019లో కనిపించారని, ఆ తర్వాతి నుంచి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు.
 
స్థానికంగా చాలాకాలంగా తాళం వేసి కనిపిస్తున్న ఇంటి గురించి స్థానికుడు ఒకరు గురువారం మీడియాకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన పరిచయస్తులు, బంధువులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్నాథ్ రెడ్డి కుటుంబం ఏకాంత జీవితం గడుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. చివరిసారి వారు జూన్-జులై 2019లో కనిపించినట్టు తెలిపారు.
 
ఆ ఇంట్లో 2019 సంవత్సరం నాటి క్యాలెండర్ వేలాడదీసి ఉండడంతో ఘటన అదే ఏడాది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. నాలుగు అస్థిపంజరాల్లో రెండు మంచంపైన, రెండు నేల మీద పడివున్నట్టు పోలీసులు తెలిపారు. మరో గదిలో మరో అస్థిపంజరాన్ని గుర్తించారు. వారి మృతికి కచ్చితమైన కారణం తెలియదని అయితే, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటాప్సీ తర్వాత అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి జి.పరమేశ్వర విచారణకు ఆదేశించారు.