గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (09:24 IST)

తమిళనాడులో దారుణం.. తన భార్య అనుకుని మరో మహిళను హత్య చేసిన భర్త

woman
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య అనుకుని మరోమహిళను ఓ కసాయి భర్త హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాళాల వద్ద ఉన్న ఇందిరానగర్‌ పరిధి అనే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌ అనే పశువుల వ్యాపారికి మొదటి భార్య రేణుకామ్మాళ్‌ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. 
 
అలాగే, అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి చనిపోవడంతో ఆయన భార్య ధనలక్ష్మిని దేవేంద్రన్‌ ఐదు నెలల క్రితం రెండో వివాహం చేసుకొన్నాడు. దంపతులు అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ కారణంగా ధనలక్ష్మి ఇటీవల ఆంబూరులోని పుట్టింటికి వెళ్లింది. అయితే, ఆంబూర్‌ రైల్వే స్టేషను ఎదురుగా ఉన్న నేతాజీ రోడ్డులో పాదరక్షలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి.
 
ఆ దుకాణాల ఎదుట రాత్రి సమయాల్లో యాచకులు, నిరాశ్రయులు నిద్రిస్తుంటారు. ధనలక్ష్మి కూడా రాత్రి సమయాల్లో ఆ దుకాణాల ఎదుట నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్‌కు సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి అక్కడికి వచ్చాడు. ఇక్కడ ధనలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన గౌస్ బాషా అనే వ్యక్తి భార్య గౌసర్‌, ఆమె అత్త ఫర్వీన్‌, పిల్లలు నిద్రిస్తున్నారు. 
 
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆంబూరు వచ్చిన దేవేంద్రన్‌ చీకట్లో ధనలక్ష్మి అనుకొని గౌసర్‌ను కత్తితో గొంతుపై, ఛాతీభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో గౌసర్‌ తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న ధనలక్ష్మి నిద్ర లేచింది. దీంతో ఆమెను కూడా దేవేంద్రన్ కత్తితో పొడిచాడు. 
 
స్థానికులు దేవేంద్రన్‌కు దేహశుద్ధి చేసి ఆంబూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చేసరికి గౌసర్‌ చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆంబూర్‌ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మిని వేలూర్‌ అడుకంపారై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.