మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (18:01 IST)

బాబుకు జిలేబీ - బామ్మకు బిస్కెట్.. పీకే టీమ్ పక్కా స్కెచ్...

చంద్రగిరి కోటలో రాబోయే ఎన్నికల్లో పాగా వేసేదెవరు. వరుస విజయాలతో దూసుకుపోయే గల్లా కుటుంబానికి ఎదురైన పరాభవం ఏమిటి. ఎలా తప్పించుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరిని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు. గల్లా అరుణకుమారి వైసిపి నుంచి బరిలో దిగేందుకు సిద్థ

చంద్రగిరి కోటలో రాబోయే ఎన్నికల్లో పాగా వేసేదెవరు. వరుస విజయాలతో దూసుకుపోయే గల్లా కుటుంబానికి ఎదురైన పరాభవం ఏమిటి. ఎలా తప్పించుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరిని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు. గల్లా అరుణకుమారి వైసిపి నుంచి బరిలో దిగేందుకు సిద్థమవుతున్నారా.. టిడిపిలో ఆమెకు ఉన్న ఇబ్బందులు ఏమిటి. 
 
చంద్రగిరి. చంద్రబాబు సొంత నియోజకవర్గం. పుట్టింది పెరిగింది ఇక్కడే. అయితే రాజకీయంగా పట్టు సాధించడంలో చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యారు. గత 20 యేళ్ళుగా చంద్రగిరిలో టిడిపి ఓడిపోతూనే ఉంది. సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకునేందుకు అనేక రకాల ఎత్తుగడలు వేసినా అవేవీ ఫలించలేదు. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం గత ఎన్నికల్లో వైసిపి వచ్చింది. ఇప్పుడు మరోసారి చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. 
 
చిత్తూరు జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకురాలిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గల్లా అరుణకుమారి మరోసారి పోటీలో దిగేందుకు ప్రణాళికలు సిద్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి గత ఎన్నికల్లో టిడిపిలో చేరిన గల్లా ఇదే నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తన కొడుకు గుంటూరు ఎంపిగా టిడిపిలో ఉండడంతో ఆమె పార్టీని వీడలేకపోయారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ చంద్రగిరి సీటు తనకు ఇస్తారో లేదోనన్న డైలమాలో పడిపోయారు గల్లా అరుణకుమారి. అందుకే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
వైసిపిలో చేరితే ఆమెకు టిక్కెట్టు ఇస్తామన్న సంకేతాలు రావడంతో ఆ వైపుగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తనతో పాటు తన కుమారుడు గల్లా జయదేవ్ కూడా వైసిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనికి తాజాగా సూపర్ స్టార్ కృష్ణ చేసిన జగన్ మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడం నిదర్శనం అనుకోవచ్చు. అసలు గల్లా అరుణకుమారికి టిడిపిలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి.. ఆమెకు ఆమెగా నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నా.. ఆమెను ఆ పదవి నుంచి బలవంతంగా తప్పించారన్న సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా తనకు ఎక్కడా ప్రాధాన్యత లభించడం లేదంటూ గల్లా తన సన్నిహితుల ముందు వాపోతున్నారట. ఇంతకీ చంద్రగిరి టిడిపిలో ఏం జరుగుతోంది. 
 
టిడిపి యువనాయకుడు నారా లోకేష్‌. రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు. చంద్రగిరి తన సొంత ఊరు కావడంతో, అందులోను అక్కడ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో నారా లోకేష్‌ చంద్రగిరి నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు చంద్రబాబు. ఇటు కొడుకును ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయించడంతో పాటు అటు సొంతూరులోనే చంద్రబాబు పార్టీని గెలిపించుకోలేకపోయారన్న అపకీర్తి నుంచి బయటపడటం కోసం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్‌ చంద్రగిరి నుంచి పోటీ చేస్తే గెలవడం అంత ఆషామాషీ కాదు. పేరుకు చంద్రబాబుకు సొంతూరే అయినా టిడిపికి అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. 
 
గత మూడు, నాలుగు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దానికి నిదర్శనం. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య చంద్రగిరి నుంచి లోకేష్‌ బాబును బరిలోకి దించే సాహసోపేతమైన నిర్ణయానికి చంద్రబాబు సిద్థమవుతున్నారా. అందుకే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గల్లా అరుణకుమారిని పిలిచి పార్టీ జిల్లా అధ్యక్షుడికి పులివర్తి నానికి ఆ బాధ్యతలు అప్పగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటికి లోకేష్‌ బాబు గెలుపుకు మార్గాన్ని సుగుమమం చేయడం కోసమే ఈ మార్పులంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇదిలా ఉంటే గల్లా కుటుంబం ఇప్పుడు వైసిపిలో చేరబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో సీటే లక్ష్యంగా తన కొడుకుతో పాటు కలిసి వైసిపి తీర్థం పుచ్చుకోవడం కోసం గల్లా అరుణకుమారి ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన సీనియర్ వైసిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
తను పార్టీలోకి వస్తే తనకు చంద్రగిరి టిక్కెట్‌తో పాటు తన కొడుకు గల్లా జయదేవ్‌కు ఎంపి టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్దుబాట్లు కొలిక్కి రాకపోవడంతో ఈ ప్రయత్నాలు చర్చల దశలోనే ఉన్నాయంటున్నారు. నిజంగా గల్లా అరుణకుమారి వైసిపిలో చేరితే తన రైట్ హ్యాండ్‌గా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ పక్కన పెట్టబోతున్నారా.. చెవిరెడ్డిని కాదని గల్లా అరుణకుమారికి చంద్రగిరి సీటు ఇస్తారా అన్నది సందేహమే. ఒకవేళ సీనియర్ నాయకురాలు కాబట్టి గల్లా అరుణకుమారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా తన కొడుకుకు ఎంపి టిక్కెట్టును సర్దుబాటు చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కూడా చాలామంది పార్టీలో చేరతామన్నా వారికి సీట్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక జగన్ చాలామంది నాయకులను చేర్చుకోలేదు. అది చివరకు ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమైందని అంచనాకు వచ్చారు జగన్. అందుకే ఈసారి పార్టీలోకి వచ్చేవారందరినీ ముందుగానే సమీకరించుకుని సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ తెచ్చుకోవడం కోసం పి.కె. టీం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుకు, టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.