చిలుకూరి బాలాజీకి రూ.1000 కోట్ల వ్యవహారం.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతుందా?
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత తెలంగాణ తిరుమలగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ ఆలయానికి ఇవ్వాల్సిందిగా డిమాండ్ వచ్చింది. ఇందులో భాగంగా టీటీడీ తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల బాకీని తక్షణమే
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత తెలంగాణ తిరుమలగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ ఆలయానికి ఇవ్వాల్సిందిగా డిమాండ్ వచ్చింది. ఇందులో భాగంగా టీటీడీ తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలంటూ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీటీడీకి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏ విధంగా టీటీడీ తెలంగాణకు బాకీ పడిందని సౌందర్యరాజన్ వాదిస్తున్నారు? కచ్చితంగా రూ.వెయ్యి కోట్లని ఎలా చెప్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమిచ్చేలా.. నివేదిక ఉండాలని కోర్టు వెల్లడించింది.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? 1987 నుంచి టీటీడీ తెలంగాణకు దాదాపుగా వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటివరకు ఏడాదికి రూ. 56 లక్షలు మాత్రమే చెల్లిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకా వెయ్యి కోట్లు బాకీ ఉన్నందున తక్షణమే చెల్లించేలా ఆదేశించాలని సౌందర్యరాజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ వెయ్యి కోట్ల వ్యవహారంపై టీటీడీకి చెందిన సభ్యులు ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి రాముడిని తాము వదిలిపెట్టామని ప్రస్తుతం ఆ ఆలయ ఆదాయాన్ని ఇవ్వాల్సిందిగా కోరితే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. దేవదేవుని ఆస్తుల్లో వాటా ఇవ్వాలంటూ చిలుకూరు ఆలయ అర్చకుడు హైకోర్టును ఆశ్రయించడంపై వారు మండిపడుతున్నారు. దేవుని ఆస్తులపై వాటాలకు సంబంధించి చర్చించుకోవడంపై వారు ఫైర్ అవుతున్నారు.
తెలంగాణలో టిటిడికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని, పలు దేవాలయాల అభివృద్ధికి టిటిడి నిధులు సమకూరుస్తున్నందున తిరుమల వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని పిటిషనర్ కోరడం సబబు కాదంటున్నారు. ఇది ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా ఉందని వారు వాదిస్తున్నారు.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో టీటీడీ పలు ప్రాంతాల్లో ఆలయాలతో పాటు కల్యాణమండపాలను నిర్మించింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలకు కూడా టీటీడీ విరివిగా నిధులను వెచ్చించింది. కానీ రాష్ట్రం విడిపోయాక తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అంతేకాకుండా అప్పటిదాకా టీటీడీ పర్యవేక్షణ కింద రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు… ఏ రాష్ట్రంలో ఉంటే, ఆ రాష్ట్రం పరిధి కిందకే వెళ్లిపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే హైదరాబాదులోని హియాయత్ నగర్‌లో ఆలయం, కల్యాణమండపాన్ని ఏర్పాటు చేసిన టీటీడీ… ఆ తర్వాత చిలుకూరు సమీపంలోని బాలాజీ టెంపుల్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన అనంతరం పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులకు కూడా పాలకమండలిలో చోటు కల్పించింది. కానీ టీటీడీకి వచ్చే ఆదాయం నుంచి తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావట్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. మరి దీనిపై హైకోర్టు ఎలా తీర్పునిస్తుందో చూడాల్సి ఉంది.