శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (11:10 IST)

దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలకు కారణం ఏంటో తెలుసా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉత్తర భారతాన్ని ముంచేసిన వర్షాలు ఇపుడు.. దక్షిణ భారతంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, గత పది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి భాగ్యనగరం అతలాకుతలమైపోయింది. గత వారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అలాగే, ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
వాస్తవానికి ఏపీ, తెలంగాణాల్లో అక్టోబరు నెల వచ్చిందంటే వర్షాకాలం ముగిసినట్టే. అయినా చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో ఇంత భారీ వర్షాలేంటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న వేళ, వాతావరణ కేంద్రాలతో పాటు శాస్త్రవేత్తలు, అధ్యయనాలు చేసి ఓ అంచనాకు వచ్చారు. 
 
ఇంత భారీ వర్షాలకు కరోనా కూడా కారణమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవికాలమంతా అంటే, మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్డౌన్ అమలైందని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు, ఈ సమయంలో కాలుష్యం కనిష్టానికి పడిపోయిందని, ఫలితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి, తేమ శాతం పెరిగిందని స్పష్టం చేశారు.
 
వాతావరణంలో ఏర్పడిన అనూహ్య మార్పు, మరిన్ని వర్షాలను ప్రోత్సహించిందని, దీనికితోడు వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా, నైరుతీ రుతుపవనాలు వెనక్కు మళ్లడం ఆలస్యమైందని, ఇదేసమయంలో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం భారత ఉపఖండంపై ఏ మాత్రమూ కనిపించలేదని వెల్లడించారు. ఈ కారణంతోనే వర్షాలు అధికంగా కురుస్తున్నాయని తెలిపారు.
 
గడచిన 11 సంవత్సరాల్లో 2018లో మాత్రమే నైరుతీ రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా సెప్టెంబరు 29న నిష్క్రమణను ప్రారంభించాయని, ఈ సంవత్సరం సెప్టెంబరు 28నే అవి వెనక్కు మళ్లాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
వాస్తవానికి ఆ రోజుతో వర్షాకాలం ముగింపు మొదలైనట్టే. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వస్తున్న తేమగాలులు, మధ్యప్రదేశ్‌పై ఉన్న రుతుపవనాలకు అడ్డుగా నిలిచి, వాటిని ఎటూ కదలకుండా ఆపివేశాయి.
 
ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి పవనాలు తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, బంగాళాఖాతంలో ప్రశాంతత ఏర్పడితేనే అవి పూర్తిగా వెనుదిరుగుతాయని అంచనా వేశారు. 
 
కనీసం మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండి తీరుతుందని, ఆ తరువాతే వర్షాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.