ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన వంతెనకు ముప్పు?
హైదరాబాద్ సంస్థానంలో నిర్మించిన వంతెనల్లో మొదటిది పురానాపూల్ బ్రిడ్జి. దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్‌షా 1578లో నిర్మించారు. ఈ వంతెన నిర్మించి సుమారు 400 సంవత్సరాలు అయివుంటుంది. అలాంటి వంతెన ఇపుడు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుని పోయిన విషయం తెల్సిందే. ఈ వర్షం, ఈ కారణంగా వచ్చిన వరద ప్రభావం ఈ వంతెనపై కూడా పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి పెరగడంతో బ్రిడ్జి ఒత్తిడికి గురైంది.
ఫలితంగా గత రాత్రి ఓ పిల్లర్ కుంగిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వైపుల నుంచి ట్రాఫిక్ నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
4 శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసి వరదలకు స్వల్పంగా దెబ్బతింది.
దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించాడు.