శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (08:37 IST)

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం... వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతం...

హైదరాబాద్ నగరంలో మళ్లీ కుండపోత వర్షం మొదలైంది. సోమవారం రాత్రి నుంచి ఈ వర్షం కురుస్తూనే వుంది. ఫలితంగా కాస్త తెరపించిందని భావించిన వర్షం మళ్లీ కురుస్తోంది. తిరిగి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇంకా కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీ, బేగంపేట, బోయిన్‌పల్లి, నాంపల్లి, ప్యారడైజ్, కోఠి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.
 
మరోవైపు, మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక శిబిరాలకు తరలించారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
 
అయితే, గత వార్షం కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, వందేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో నెలకొన్న ఉత్పాతం ఇది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి నగరం ముంపునకు గురైంది. హైదరాబాద్‌ చరిత్రలో ఇంత భారీస్థాయిలో వానలు పడటం ఇది రెండోసారి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన ఈ వానల వల్ల విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అతిపెద్ద వరద విలయాన్ని తట్టుకోవడానికి యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ముంబైలో 2005లో వరదలు వచ్చినప్పుడు నేను కూడా బాధితుడినే. అప్పుడు నేను విక్టోరియాలో ఉన్నాను. 24 గంటలపాటు వరదల్లో చిక్కుకున్నాను. బాంద్రా వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్లాను. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ టోక్యోలో బాగుంది. ఆయా దేశాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒకచోట జరిగింది అంతటా జరుగాలంటే సాధ్యంకాదు. మన దేశానికి ఏది సరిపోతుందో అది చేయాల్సి ఉంటుంది అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.