శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:03 IST)

అత్త నాకిచ్చింది.. నన్నెవరూ పీకలేరు... టీటీవీ దినకరన్

తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కథ గుర్తుకు వస్తుంది. టామ్ అండ్ జెర్రీలకు ఒక్క నిమిషం కూడా పడదు. ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితే తమిళనాడులో కనిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కథ గుర్తుకు వస్తుంది. టామ్ అండ్ జెర్రీలకు ఒక్క నిమిషం కూడా పడదు. ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితే తమిళనాడులో కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి పదవి కోసం కొంతమంది చేస్తున్న ఫీట్లు అలాంటిది. జయలలిత మరణం, శశికళ జైలుకు వెళ్ళడం తర్వాత అన్నాడిఎంకే మూడు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. పన్నీరుసెల్వం, పళణిస్వామి, దినకరన్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యారు. 
 
రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక దినకరన్ జైలుకు వెళ్ళిన తరువాత అన్నాడిఎంకేలోని పళణి, పన్నీరులు కలిసిపోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పన్నీరుసెల్వం రెండు షరతులకు పళణిస్వామి అంగీకరించక పోవడంతో అది కాస్త ఆగిపోయింది. మొదటి షరతు శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి పంపేయాలి, రెండవది జయలలిత మరణంపై విచారణ జరిపించాలి. అయితే ఇందుకు పళణిస్వామి ఒప్పుకోకపోవడంత ఇద్దరూ చర్చలు మానుకున్నారు.
 
ఇది జరుగుతుండగానే దినకరన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. రాగానే పార్టీపై దృష్టి పెట్టాడు. పార్టీలో ఇప్పటికే తనకున్న ఉప ప్రధాన కార్యదర్శి పదవితో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశాడు. దీంతో పళణిస్వామికి భయం పట్టుకుంది. ఉన్న ముఖ్యమంత్రి పదవికి దినకరన్ ఎసరు పెడుతున్నాడని గమనించి మళ్ళీ పన్నీరుసెల్వంతో చర్చలు ప్రారంభించాడు. ఇప్పుడు పన్నీరుసెల్వం చెప్పినట్లు దినకరన్, శశికళను పార్టీ నుంచి పూర్తిగా సాగనంపే ప్రయత్నం ప్రారంభించారు.
 
అత్యవసరంగా గురువారం అన్నాడిఎంకే ముఖ్య నాయకులతో సమావేశమైన పళణిస్వామి దినకరన్ నియామకం చెల్లదని, పార్టీకి సంబంధించి ఆయన ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తీర్మానించారు. ఇదికాస్త దినకరన్‌కు కోపం తెచ్చిపెట్టింది. ఉప ప్రధాన కార్యదర్శి నుంచి తొలగించడానికి మీరు ఎవరని, మా మేనత్త నాకిచ్చిన పదవి ఇది.. నన్నెవరూ పీకలేరంటూ నియామక పేపర్లను మీడియాకు చూపించారట. మొత్తం మీద పళణి, పన్నీరు, దినకరన్‌లకు మధ్య జరుగుతున్న హైడ్రామా తమిళనాడు రాజకీయాల్లో రసవత్తరంగా మారుతోంది.