శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (04:54 IST)

'అమ్మ' శపథం భీష్మ ప్రతిజ్ఞ.. కరుణిస్తే అమ్మ.. కత్తికడితే అంబ.. అదే జయలలిత

మొండితనం.. ప్రతీకారేచ్ఛ.. ఇవే జయలలిత ఆభరణాలుగా చెప్పుకోవచ్చు. ఆమె పట్టుదల చాలా గట్టిది. మంచి దృఢ సంకల్పం కలిగిన ధీరవనిత. స్వర్గీయ ఎంజీఆర్‌ చాటున బతికినా ఆమెకంటూ కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలుండేవి. అమర్

మొండితనం.. ప్రతీకారేచ్ఛ.. ఇవే జయలలిత ఆభరణాలుగా చెప్పుకోవచ్చు. ఆమె పట్టుదల చాలా గట్టిది. మంచి దృఢ సంకల్పం కలిగిన ధీరవనిత. స్వర్గీయ ఎంజీఆర్‌ చాటున బతికినా ఆమెకంటూ కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలుండేవి. అమర్యాదను సహించేవారు కాదు. అవమానాన్ని జీర్ణించుకోలేరు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవారు. దెబ్బకుదెబ్బ కొట్టేంత వరకు నిద్రపోయేవారు కాదు. 
 
ఈ విషయంలో తన ప్రత్యర్థి కరుణానిధినే కాదు.. తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన ఎంజీఆర్‌నూ వదల్లేదు. సహనటుల గురించి చెప్పనక్కర్లేదు. ఆమెకు ఎవరైనా, ఎంతపెద్దవారైనా వంగి దండం పెట్టాల్సిందే. అలా చేయని పార్టీ నేతలను దూరం పెడతారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె సినీజీవితం 1980 నాటికి వెలవెలబోయింది. ఎంజీఆర్‌ తనను విస్మరించాక తెలుగు హీరో శోభన్‌బాబు వద్దకు చేరువయ్యారు. 
 
ఆ సమయంలో ఆమె ఒంటరితనంతో కుంగిపోయారు. సోదరుడు జయకుమార్‌ కూడా ఆమె బాగోగులు చూడలేదు. ఈ దశలో అంటే 1981లో జయలలిత ఓసారి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించినట్టు వినికిడి. ఇది తెలిసి సీఎం ఎంజీఆర్‌ మళ్లీ ఆమెను దగ్గరకు చేరదీశారు. కరుణానిధిని బర్త్‌రఫ్‌ చేయని ఎన్డీయే సర్కార్‌నే కూల్చేసిన చండశాసనురాలు పురట్చితలైవి. 
 
1998లో నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వానికి జయలలిత మద్దతు ప్రకటించారు. కానీ రాష్ట్రపతికి లేఖ ఇచ్చేందుకు మాత్రం తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాప్పించారు. ఆమె లేఖ ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరతానని వాజ్‌పేయి తేల్చి చెప్పారు. ఈ విషయంలో జయలలిత తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. 
 
చివరకు ఆమె మద్దతు లేఖ ఇచ్చారు. అనంతరకాలంలో నాటి తమిళనాడు సీఎం కరుణానిధిని బర్తరఫ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వాజ్‌పేయి అంగీకరించకపోవడంతో ఆయనకు మద్దతు ఉపసంహరించారు. ఫలితంగా విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం 11 రోజుల్లోనే కుప్పకూలిపోయింది. 
 
జయలలితకు కోపమొస్తే ప్రత్యర్థులు అథఃపాతాళానికి వెళ్లాల్సిందే. 2003లో జయ సీఎంగా ఉన్నప్పుడు జీతభత్యాల పెంపు డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆగ్రహించిన జయ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఒక్క సంతకంతో ఆ లక్షమందిని కొలువుల నుంచి తొలగించారు. తొలగింపు తో ఖాళీ అయిన పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోకుండా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో వస్తే చాలు, ఉద్యోగంలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేశారు. 
 
'అమ్మ..అమ్మ' అంటూ తన చుట్టూ తిరిగిన శశికళ సమీప బంధువు సుధాకరనను దత్తత తీసుకున్న జయలలిత ఆనక అతను పార్టీలోనూ, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ మించిపోతున్నాడన్న కోపంతో దత్తతను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత సుధాకరన పార్టీ కార్యక్రమాల్లో గానీ, పోయెస్‌ గార్డెన్ ఛాయల్లో గానీ కనిపించలేదు. అంతేనా, ఆయన వద్ద హెరాయిన్ పట్టుబడ్డట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మీడియాపైనా ఉక్కుపాదం తనకు వ్యతిరేకంగా రాసిన మీడియాపైనా జయ ఉక్కుపాదం మోపేందుకు సాహసించారు. వేళ్లూనుకునిపోయిన పత్రికాధిపతుల్ని సైతం పరుగులు పెట్టించారు. ఈ కోవలో ది హిందూ పత్రిక యాజమాన్యాన్ని  సైతం గడగడలాడించారు. దీంతో ఆఖరికి ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా, అసలేం జరిగిందో తెలుసుకుని రాసేందుకు సైతం మీడియా వెనుకంజ వేసేది. ప్రభుత్వం, ఆసుపత్రి ఇచ్చిన ప్రకటనల్ని యధాతథంగా ప్రచురించడం మినహా జయ ఆరోగ్యంపై 'పరిశోధనా కథనాలు' రాసేందుకు సైతం ఇక్కడి మీడియా సాహసం చేసేది కాదు. 
 
1987లో ఎంజీఆర్‌ మరణం జయలలితకు బాధతోపాటు అవమానాన్నీ మిగిల్చింది. ఎంజీఆర్‌ సతీమణి జానకి మద్దతుదారులు జయపై చేయి చేసుకున్నంత పనిచేశారు. ఎంజీఆర్‌ మృతదేహం తల భాగాన నిలబడి ఉన్న జయలలితను ఈడ్చుకుంటూ బయటకు గెంటేశారని అన్నాడీఎంకే వర్గాలు గుర్తు చేసుకుంటుంటాయి. ఈ ఘటన ఆమెపై ఎంతో ప్రభావం చూపింది. అదేసమయంలో ఆ ఘటనని ఉపయోగించుకొని జానకికి వ్యతిరేకంగా ప్రజా సానుభూతి పొందేందుకు ఆమె ఎత్తుగడ వేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో జానకి ప్రభావం తగ్గి పార్టీ మొత్తం జయ చేతుల్లోకి వచ్చేసింది. 
 
ఇకపోతే.. 1989 ఎన్నికల్లో జయ వర్గం 27 స్థానాల్లో గెలిచి ఆమె ప్రతిపక్ష నాయకురాలయ్యారు. జానకి వర్గం అదే ఏడాది జయ పార్టీలో విలీనమైంది. ఆ సంవత్సరంలోనే తమిళనాడు అసెంబ్లీలో కనీవినీ ఎరుగని దుశ్శాసన పర్వం జరిగింది. సీఎం కరుణానిధి ప్రోద్బలంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలోనే ఆమె చీరలాగేందుకు ప్రయత్నించిన ఘటన దేశమంతా కలవరం రేపింది. ఆమెను కొట్టి గాయపరిచారు కూడా. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన ఆమె సీఎం పదవి చేపట్టేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991లో ముఖ్యమంత్రిగానే ఆమె సభలోకి అడుగుపెట్టారు. 
 
1996లో డీఎంకే ప్రభుత్వ హయాంలో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. 'నేను ఎక్కడికైతే వెళ్లానో, నా ప్రత్యర్థుల్ని కూడా అక్కడికే పంపిస్తాను' అని బహిరంగంగా జయ శపథం చేశారు. 2001లో జయ సీఎం అయ్యారు. అన్నట్టుగానే కరుణానిధిని అర్థరాత్రి అరెస్టు చేయించి, తనను ఉంచిన జైలు గదిలోకే తోశారు. 
 
జయలలిత నివాసం నుంచి ఐటీ అధికారులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. జయ ఇంట దొరికిన బంగారమంతా ఆమెకు బహుమతిగా లభించిందేనని డీఎంకే నేతలు ఎద్దేవా చేశారు. దీనిపై ఆగ్రహించిన జయ కేసు నుంచి బయటపడేవరకు, బంగారం ధరించబోమని భీకర ప్రతిజ్ఞ చేశారు. 
 
జయలలితకు అత్యంత విశ్వాస పాత్రుడు ఎవరంటే చిన్న పిల్లాడు సైతం చెబుతాడు ఓ పన్నీర్‌ సెల్వం అని. ఈయన్ను పలుమార్లు ఆమె సీఎం చేసింది. కానీ ఈయన కొంచెం ఓవర్‌ యాక్షన్‌ చేశాడని తెలియడంతో ఆయన్ను ఒక రోజు పాటు జైలు వద్దే పడిగాపులు కాసేలా చేశారు. పన్నీర్‌ సెల్వంను సీఎంగా ప్రకటించిన తర్వాత ఆయన ఓ రాత్రి పార్టీ చేసుకున్నాడు. ఆ సంగతి జైల్లో ఉన్న అమ్మకు తెలిసింది. తర్వాత పన్నీర్‌ సెల్వం అమ్మను చూడటానికి జైలుకు వచ్చారు. అప్పుడు ఆయనపై అలిగిన అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పన్నీర్‌ను జైలు చుట్టూ తిప్పించారు. చివరికి సాయంత్రానికి కరుణించి, మాట్లాడి పంపించారు.