శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:18 IST)

కాబూల్ వీధుల్లో ప్రజల నిరసనలు: ఆఫ్ఘన్ రావణకాష్టం, అదిరిపోతున్న తాలిబన్లు

ప్రజాస్వామ్యాన్ని అనుభవించినవారిని చట్రంలో ఇరికించాలని చూస్తే ఏం జరుగుతుందో ఎన్నో దేశాల్లో ఇప్పటికే ప్రపంచం చూసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు వీధుల్లోకి వచ్చేస్తున్నారు. మొన్నటివరకూ స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆఫ్ఘన్లను తాలిబన్లు తుపాకులతో భయపెట్టాలని చూసినా పట్టించుకోవడంలేదు. ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వచ్చేస్తున్నారు. గురి చూసి గుండెల్లో బుల్లెట్లు దించుతున్నా వాటికి ఎదురుగా వెళ్తున్నారు.
 
ఈ తిరుగుబాటు పోరాటంలో ఇప్పటికే పలువురు మరణించారు. ప్రాణాలు పోతాయనే భయం ఆఫ్ఘన్ ప్రజలకు ఏమాత్రం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రతిరోజూ చస్తూ బ్రతకడం కంటే ప్రజాస్వామ్యం వచ్చేవరకూ పోరాటం చేసి చావడం నయం అని వారు అనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న గురువారం నాడు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసన తెలిపారు.
 
తాలిబన్ జెండాను కిందకు దించేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసారు ధైర్యంగా. ప్రజల నుంచి ఇలాంటి వ్యతిరేకత రావడంతో తాలిబన్లు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ తిరుగుబాటు ఇలాగే కొనసాగితే పరిస్థితి తమ చేయి దాటిపోతుందన్న ఆందోళనలో వారున్నారు. ఐతే గురువారం తమకు వ్యతిరేకంగా గళం వినిపించినవారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు మరణించారనీ, పెద్దసంఖ్యలో గాయపడ్డారన్న వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలావుంటే దేశంలో కాబూల్ విమానాశ్రయంలోనే కాకుండా ఇతర చోట్ల విమానాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ వాటిని నడిపేందుకు ఇప్పుడు పైలెట్లు లేరు. దీనితో విమానాలను నడిపేందుకు పైలెట్లు విధుల్లోకి వచ్చి తమతో కలిసిపని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో విధులను ఉద్యోగులు యధావిధిగా నిర్వర్తించాలని చెప్పారు. కానీ ఆ మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నిరసనలు, ఆకలి కేకలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.