1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 మే 2025 (19:06 IST)

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

Dil Raju
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ నిర్మాత ధన్యావాదాలు తెలిపారు. టికెట్ ధరల పెంపు, థియేటర్లలో తినుబండారాల ధరలపై పవన్ సూచనలు, ఆలోచనలతో ఏకీభవిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు దిల్ రాజు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
"సగటు సినిమా ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడం అనే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆయన అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి కలిసికట్టుగా ముందుకుసాగుదాం. 
 
దాంతోపాటు థియేటర్ల నుంచి వేదికలపైకి సినిమాలు త్వరగా వెళుతుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపునకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకుడుకి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 
 
అదేసమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలసికట్టుగా పైరసీపై పోరాడినపుడే మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతాం. అలాగే, ఏపీ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంపై కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినమా అభివృద్ధికి నిర్మాతల మండలి నుంచి కలిసికట్టుగా సంపూర్ణ సహకారం అందిస్తాం' అని దిల్ రాజు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.