ఎపిలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్... జనసేనకు రావెల రిజైన్ చేసి వెంటనే కన్నాతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు. తాజాగా ఇవాళ జనసేనకు రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు వెంటనే కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. ఆయన భాజపాలో చేరుతారని చెప్పుకుంటున్నారు.
ఇదిలావుంటే ఘోర పరాజయం తాలూకూ నిస్పృహ ఒకవైపు టిడిపిని వెంటాడుతూనే ఉంది. అదే సమయంలో ఇటు టెన్షన్ ఎపిసోడ్ బిల్డప్ అవుతూ వస్తోంది. కేశినేని నాని కాషాయ కండువా వేసుకోబోతున్నారన్న ప్రచారాన్ని నాని ఖండించడం ఆపై అలగడం.. గల్లా జయదేవ్ బుజ్జగించడం. సీన్‌లోకి చంద్రబాబు ఎంట్రీ. ఇలా వరుస పరిణామాలు చకాచకా జరిగిపోయాయి. అయినా కేశినేని విషయం పైన తెలుగు తమ్ముళ్ళను సందేహం మాత్రం వెంటాడుతూనే ఉందట. ఇంతలోనే మరో ఎంపి కూడా జంపింగ్ చేస్తున్నారన్న ప్రచారం తెలుగు తమ్ముళ్ళలో అలజడి రేపుతోందట.
ఎపి ఎలక్షన్ వార్ అలా ముగిసిందో లేదో టిడిపిలో సంక్షోభం ఎపిసోడ్ కొద్దికొద్దిగా బలపడుతోంది. 25 పార్లమెంటు స్థానాల్లో టిడిపి గెలిచింది కేవలం ముగ్గురు మాత్రమే. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే కేశినేని నాని కాస్త కాషాయనేని నానిగా మారబోతున్నారన్న ప్రచారం టిడిపిలోనే ఊపందుకుంది. గెలిచిన నాటి నుంచి ఢిల్లీ లోనే ఉండటం.. వరుసగా బిజెపి నేతల్ని కలుస్తుండటం, విజయవాడలో చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా హాజరు కాకుండా ఢిల్లీలోనే ఉండడం... ఇలా కేశినేనా నాని వ్యవహారశైలి తెలుగు తమ్ముళ్లలో డౌట్ వచ్చేటట్లు చేస్తోంది.
అయితే తను పార్టీ మారనని చెబుతూనే, రాజ్యసభలో విప్ పదవి వద్దంటూ వేడి రాజేశారు. దీంతో అటు బుజ్జగింపుల ఎపిసోడ్ నడుస్తున్న వేళ మరో టిడిపి ఎంపి కూడా సైకిల్ దిగడానికి రంగం సిద్థం చేసుకుంటున్నారన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరందుకుంది. మరో టిడిపి ఎంపి అంటే కేశినేని కాకుండా ఉన్నది ఇద్దరే. ఒకరు గల్లా జయదేవ్ మరొకరు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరన్న విషయంపై నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఒకవైపు కేశినేని నాని విషయంలో తెలుగు తమ్ముళ్ళు ఆలోచిస్తుండగా మరోవైపు ఇంకో ఎంపి జంప్ చేస్తున్నారన్న వస్తున్న ప్రచారం టిడిపి శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపిని బలహీనపరిచి ఆ వ్యాక్యూమ్‌ను తాము భర్తీ చేయాలని బిజెపి నేతలు ఆలోచనలో ఉన్నారట.