రాజీనామా చేయం.. దమ్ముంటే రద్దు చేసుకోండి : తితిదే ఛైర్మన్ సవాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల పాలకమండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. దమ్ముంటే పాలక మండలిని రద్దు చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు.
ప్రస్తుతం తితిదే పాలక మండలిని గత తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. అయితే, ఇటీవల వెల్లడైన సార్వత్రి ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. దీంతో అనేక మంది టీడీపీ నేతలు తాము అనుభవిస్తున్న నామినేటెడ్ పోస్టులకు స్వచ్ఛంధంగా రాజీనామాలు చేస్తున్నారు.
దీంతో తితిదే ఛైర్మన్ పదవితో పాటు బోర్డు సభ్యులు కూడా రాజీనామాలు చేయాలని వైకాపా నేతలు డిమండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తితిదే బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తితిదే అధికారులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం మారడంతో పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా ఈ సమావేశాన్ని అధికారులు బహిష్కరించినట్టుగా ఉన్నారు.
ఈ సమావేశానికి తితిదే అధికారులు రాకపోవడంపై బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పందిస్తూ, మంగళవారం ఉదయం బోర్డు సమావేశం కావాలని ముందుగానే నిర్ణయించామనీ, కానీ, అధికారులు హాజరుకాలేదని చెప్పారు. బోర్డులోని సభ్యులు రాజీనామాలు చేసినా తాను మాత్రం చేయబోనని, ప్రస్తుత బోర్డును గత ప్రభుత్వం నియమించిందనీ, అందువల్ల ఆ బోర్డును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త ప్రభుత్వం తితిదే బోర్డును రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తాను పదవిని వీడుతానని చెప్పారు. స్వచ్చంధంగా పదవిని వీడేందుకు బోర్డు సభ్యులు సుముఖంగా లేరని చెప్పారు.