మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 16 నవంబరు 2016 (15:09 IST)

బడుగు జీవిపై మోదీ బండలు... విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మాల్యా లోన్ 1200 కోట్లు రద్దు... ప్రజల నెత్తిన SBI టోపీ?

ఒకవైపు అవినీతి, నల్లధనం దాచుకున్న కుబేరుల తాట తీయడానికే రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్ర మోదీ, బడా వ్యాపారవేత్తలు తీసుకున్న వేల కోట్లను ఒక్క ప్రకటనతో బ్యాంకులు రద్దు చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోవడంపై సామాన్య ప్రజానీకం

ఒకవైపు అవినీతి, నల్లధనం దాచుకున్న కుబేరుల తాట తీయడానికే రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్ర మోదీ, బడా వ్యాపారవేత్తలు తీసుకున్న వేల కోట్లను ఒక్క ప్రకటనతో బ్యాంకులు రద్దు చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోవడంపై సామాన్య ప్రజానీకం మండిపడుతున్నారు. 
 
పెద్ద నోట్లు రద్దు చేసి తమను వీధులపాలు జేసిన ప్రభుత్వం, బడా వ్యాపారవేత్తలు డబ్బులు తీసుకుని వ్యక్తిగత జల్సాలు చేసుకుంటూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం చేతకాక బడుగు జీవులపై బండలు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిల పేరిట సుమారు రూ. 7,000 కోట్లను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఒకవైపు సామాన్య ప్రజానీకం పైసా పైసా కూడబెట్టుకుని కుమార్తె పెళ్లికో, ఇల్లు కట్టుకునేందుకో చేర్చి పెట్టుకున్న డబ్బులో రూ.2.5 లక్షల దాటితే లెక్క చెప్పాలనీ, లేదంటే ఆదాయపు పన్ను చమడాలు తీస్తుందంటూ బెదిరిస్తున్నారు. కానీ కోట్లకు కోట్లు సున్నం పెట్టి విదేశాలకి పారిపోయిన ఘనులనూ, డబ్బును ఇతర మార్గాలకు తరలించి దివాళా తీసామంటూ పిటీషన్లు వేసిన గుంటనక్క వ్యాపారులకు మాత్రం బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలు అనుకూలంగా ఉంటున్నాయి. 
 
దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. అలాంటి అన్నదాతకు రుణాలు ఇవ్వండయ్యా బాబూ అంటే మాత్రం బ్యాంకులకు చేతులవు రావు. అంతేకాదు... అన్నదాతల రుణమాఫీ చేయాలంటే మీటింగులపై మీటింగులు వేసి ఎంతమాత్రం మాఫీకి అంగీకరించవు. ఇక తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోతే బడుగు రైతు ఇంటికెళ్లి వారి ఆస్తులను జప్తు చేసేస్తారు. అవసరమైతే ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ వీధిలో పడేసి నానా రచ్చ చేస్తారు. అలాంటిది కోటానుకోట్లు కూడబెట్టి ఏమీ ఎరుగనట్టు తాము దివాళా తీసామని పత్రాలు సమర్పించగానే బ్యాంకులు ఇలా కోట్ల రూపాయలు రాని బాకీల కింద రద్దు చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. ఇలాంటి చర్యలతోనేనా మోదీ అవినీతిని పారదోలేది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.