బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:37 IST)

గంటాకు మంత్రి అవంతి శ్రీనివాస్ గొడవకు కారణాలేంటి?

గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌లు ఆ ఇద్దరూ ఆప్తమిత్రులు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. దశాబ్ద కాలం కలిసి ప్రయాణం చేశారు. అది ఒకప్పుడు.. కానీ నేడు బద్ధశత్రువులుగా మారిపోయారు. ఒకరంటే ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరి ఇరువురు మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి. అసలు ఎందుకిలా జరిగింది. ఏపీ రాజకీయాలను కాకపుట్టిస్తున్న ఇరువురు నేతల విభేదాలకు కారణాలు ఏంటి?
 
విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఎదిగిన ఈ ఇద్దరు నాయకులు వేరువేరు జిల్లాల నుంచి వలస వచ్చారు. రెండు దశాబ్ధాల క్రితం తెలుగుదేశం పార్టీలో గంటాశ్రీనివాస్ రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. రెండుసార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం గంటాకు వుంది. అవంతి శ్రీనివాస్ ఒకసారి ఎంపీగా... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
2009 ఎన్నికల్లో సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో టీడీపీని వీడి అందులో చేరారు గంటా. అదే సమయంలో సామాజిక కార్యకర్తగా ఉన్న అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ప్రజారాజ్యంలో చేరారు. ఆ విధంగా ప్రారంభమైన వీరిద్దరి పొలిటికల్ ఫ్రెండ్‌షిప్ 2019 ఎన్నికల ముందు వరకూ కొనసాగింది. ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగే అలవాటు గంటాకు లేదు. పార్టీలు మారడంలోనూ ఆయనపై విమర్శలు వున్నాయి. 2014 ఎన్నికల ముందు చోటుచేసుకున్న పరిణామాలతో అవంతి, గంటా శ్రీనివాస్ టీడీపీ గూటికి చేరారు. 
 
భీమునిపట్టణం స్ధా
నం నుంచి సిట్టింగ్‍ ఎమ్మెల్యేగా వున్న అవంతిని.... ఒప్పించి అనకాపల్లి ఎంపీగా పోటీకి నిలిపింది అధిష్టానం. అదే సమయంలో అవంతికి గట్టిపట్టు కలిగిన భీమిలి టిక్కెట్ సంపాదించిన గంటా ఆ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించారు. ఐదేళ్ళ పాటు ఒకరు ఎంపీగా.... మరొకరు విద్యాశాఖ మంత్రిగా జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు. ఐతే, 2019 ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంతో పాటు సమీకరణాలు మారిపోయాయి. 
 
తనకు బలం వున్న భీమునిపట్టణం స్ధానం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అవంతి శ్రీనివాస్ భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గంటాను ఒప్పించేందుకు ప్రయత్నించారు. దీనికి అంగీకరించని గంటా.... తిరిగి భీమిలి నుంచి పోటీ చేస్తానని గట్టిగా పట్టుబట్టారు. ఒక దశలో అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు అలకపాన్పు సైతం ఎక్కారు. గంటా వైఖరితో కలవరపడ్డ టీడీపీ అధిష్టానం అప్పటి హోంమంత్రి చినరాజప్పను రంగంలోకి దించింది. 
 
గంటాతో చర్చల తర్వాత భీమిలి నుంచి తమ అభ్యర్ధి గంటానే అని స్పష్టం చేశారు చినరాజప్ప. ఈ పరిణామాలు అవంతి శ్రీనివాస్‌కు మింగుడుపడలేదు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందివారు కావడంతో టీడీపీలో రాజకీయంగా తన ఎదుగుదలకు, మంత్రి పదవి చేపట్టాలన్న కోర్కెకు గంటా అడ్డంకని భావించారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. అధిష్టానం సైతం గంటాకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడంతో ఆ పరిస్ధితులను జీర్ణించుకోలేకే ఎన్నికలకు ముందు అవంతి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారనేది చర్చనీయాంశం. 
 
అవంతి శ్రీనివాస్ చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. అనకాపల్లి ఎంపీ హోదాలో ఆయన వైసీపీ నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో విజయవంతమయ్యారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించారు అవంతి. సామాజికవర్గ నాయకులను ఒక్కటి చేయడం.... చిన్నపాటి విభేదాలను సరిదిద్దడం వంటి చర్యలు ఫలితాన్నిచ్చాయి. జగన్ సృష్టించిన సునామీలో 11 అసెంబ్లీ స్ధానాలు.... మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది.
 
భీమునిపట్టణం నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచి రాష్ట్ర మంత్రయ్యారు. విశాఖ నార్త్ స్ధానం నుంచి స్వల్ప ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన గంటా పరువు నిలబెట్టుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన మొదటి రోజు నుంచి మాజీమంత్రి గంటాపై టార్గెట్ చేశారు అవంతి. రాజకీయంగా గంటాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. భీమునిపట్టణంపై పూర్తిస్ధాయి పట్టు సాధించడంతో పాటు జిల్లాలో గంటా మార్క్ చెరిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటివరకూ గంటా శ్రీనివాస్‌కు ఎదురుకాని విచిత్రమైన పరిస్ధితి ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తోంది. ఎప్పు డూ జిల్లాకు చెందిన సహచరు మంత్రులతో ఆధిపత్య పోరాటం చేసిన గంటా.... ఇప్పుడు మంత్రి హోదాలో వున్న అవంతిని ఎదుర్కోవాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గంటా వెర్సస్ పసుపులేటి బాలరాజు.... టీడీపీ హయాంలో గంటా వెర్సస్ అయ్యన్నపాత్రుడిగా రాజకీయం నడిచింది. అప్పుడు గంటా బలమైన మంత్రి.... కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే. దీంతో జిల్లాలో మారుతున్న రాజకీయ ఎత్తుగడలు ఎలాంటి పరిస్ధితులకు దారితీస్తాయోననేది ఆసక్తికరం. 
 
మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గంటా శ్రీనివాస్ పార్టీ మారతారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి గంటా ఖండిస్తున్నారు. మంత్రి అవంతి మాత్రం దొడ్డిదారిన పార్టీ మారేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తమ నాయకుడు డోర్లు మూసేయడంతో ఆగిపోయారని పరోక్షంగా గంటాకు చురకలేసేవారు. తాను పార్టీ మారాలంటే ఎవరూ అడ్డుకోలేరని గంటా చేసిన వ్యాఖ్య అవంతికి నేరుగా తగిలింది.
 
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి అవంతి, గంటాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకప్పుడు ఆప్తమిత్రులు.... బద్ధశత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు ఆ విభేదాలు బహిరంగమై వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్ధాయికి వెళ్ళిపోయాయి. ఈ పరిస్ధితికి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కారణమన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.