1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (23:42 IST)

కరోనా కారణంగా నిర్మాణరంగం కుదేలయ్యింది

విజయవాడ: కరోనా మహమ్మారి వలన అన్ని రంగాలతోపాటు నిర్మాణరంగం కుదేలయ్యిందని దీనివలన సాధారణ, మధ్య తరగతి ప్రజలు, నిర్మాణరంగం బిల్డర్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని క్రెడాయ్ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు కె.రాజేంద్ర తెలిపారు.


ఈ మేరకు మంగళవారం నాగార్జున నగర్, ఆయుష్ ఆస్పిటల్ రోడ్ సమీపంలో క్రెడాయ్ విజయవాడ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడి సరుకుల ధరలపై  కోవిడ్ వల్ల భారతదేశం లోని అన్ని వ్యాపార రంగాలు కూడా అతలాకుతలం అయ్యాయని, మరీ ముఖ్యంగా నిర్మాణరంగం ఎన్నో సమస్యలతో సతమతమౌతూ మరింత కుదేలయిందని వాపోయారు.


కార్మికులు వెళ్లిపోవడం, నిపుణులైన కార్మికులు లేకపోవడం, ఉన్న కార్మికులు కూలి రేట్లు పెంచడం, ముఖ్యంగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలలో కరోనా వల్ల అభద్రతాభావం పెరగడంవల్ల పై సమస్యలన్నీ కూడా రెట్టింపయ్యాయన్నారు. ఇప్పటికే నిర్మాణరంగానికి అత్యంత ముఖ్యమైన ముడిసరుకు ఇసుక లభ్యత సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.

ఈ పరిస్థితుల్లో మిగిలిన ముడిసరుకులైన సిమెంట్, స్టీల్, పెయింట్లు, ఎలక్ట్రికల్ సామాగ్రి, ప్లంబింగ్, సానిటరీ ఇటుకలు, ఇత్యాది నిర్మాణ రంగానికి చెందిన వస్తువులు అన్ని కూడా 30-35 శాతం పెరిగాయని వివరించారు. వీటితోపాటు డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో రవాణా ఛార్జీలుకూడా దాదాపు రెట్టింపయ్యాయని, దీనివలన నిర్మాణవ్యయం బాగా పెరిగిపోయిందని, అందువల్ల అంతిమంగా కొనుగోలుదారుడిపై భారం పెరిగిపోతోందన్నారు.

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో నిర్మాణరంగానికి చెందిన బిల్డర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని క్రెడాయ్ విజయవాడ చాప్టర్ తరపున ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియపరిస్తున్నామన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణ వ్యయాన్ని తగ్గించి కోనుగోలుదారులను, బిల్డర్ల ను ఆదుకోవాలని క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని  వెల్లడించారు. సమావేశంలో క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ఉపాధ్యక్షులు కె.వి.వి రవి కుమార్, కోశాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.