టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం. పచ్చి కూరగాయలైనటువంటి క్యాబేజీ, క్యాప్సికమ్ వంటివి పచ్చిగా తినకూడదు. మొలకెత్తిన గింజలు అస్సలు తీసుకోవద్దు. కారం, మసాలాలతో వున్న పదార్థాలు తింటే టైఫాయిడ్ వల్ల పేగుల్లో వాపు లేదా చిన్న పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
గరం మసాలా, మిరియాలు, ఎక్కువ కారం ఉన్న కూరలు తినకూడదు. ఆవకాయ పచ్చళ్లలో కారం, ఉప్పు పేగులను మరింత ఇబ్బంది పెడతాయి. జంక్ ఫుడ్ అయినటువంటి సమోసాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పూర్తిగా మానేయాలి. నెయ్యి మరియు వెన్న వంటివి కూడా తక్కువగా వాడటం మంచిది. తొక్క తీయకుండా పండ్లను తినకూడదు. ఆపిల్ వంటి పండ్లను తొక్క తీసి మెత్తగా చేసి తినాలి. పైనాపిల్, బొప్పాయి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గించడం మంచిది.
కొంతమందికి టైఫాయిడ్ ఉన్నప్పుడు పాలు తాగితే కడుపు ఉబ్బరం వస్తుంది. అలాంటి సమస్య వుంటే పాలు, గడ్డ పెరుగును కొద్ది రోజులు పక్కన పెట్టేయాలి. ఐతే మజ్జిగ తీసుకోవచ్చు. ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు కడుపులో గ్యాస్‌ను పెంచుతాయి. కూల్ డ్రింక్స్, మిఠాయిలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బయటి ఆహారాలు.. అంటే హోటల్ ఫుడ్, రోడ్డు పక్కన అమ్మే పదార్థాలను అస్సలు ముట్టుకోవద్దు. మంచినీరు కూడా కాచి చల్లార్చినవే తాగాలి. కాఫీ, టీలను తగ్గించి కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసాలు తీసుకోండి.
మెత్తగా ఉడికించిన అన్నం, ఉడికించిన బంగాళాదుంపలు, పప్పు చారు(తక్కువ కారంతో), బ్రెడ్, అరటిపండు వంటి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం శ్రేయస్కరం. టైఫాయిడ్ జ్వరం మరింత ఎక్కువగా వుంటే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
తర్వాతి కథనం
