మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (06:30 IST)

అతుక్కుపోయి పని చేస్తున్నారా.. మీ సీటుకేమీ కాదు కానీ కాస్త లేచి తిరగండి

కూర్చుని చేసే వృత్తులు వేల సంవత్సరాల నుంచి మానవ సమాజంలో ఉంటున్నాయి. కాని మునుపటి తరాలు మనలాగా అంతగా కుర్చీకి అంటిపెట్టుకోవడం ఎన్నడూ చేయలేదు. కూర్చుని పనిచేసినా అటూ ఇటూ లేచి తిరగటం, శరీరానికి ఏదో ఒకరకమ

కూర్చుని చేసే వృత్తులు వేల సంవత్సరాల నుంచి మానవ సమాజంలో ఉంటున్నాయి. కాని మునుపటి తరాలు మనలాగా అంతగా కుర్చీకి అంటిపెట్టుకోవడం ఎన్నడూ చేయలేదు. కూర్చుని పనిచేసినా అటూ ఇటూ లేచి తిరగటం, శరీరానికి ఏదో ఒకరకమైన పని పెట్టడం వెనకటి రోజుల్లో ఒకరు చెప్పకుండానే సమాజం మొత్తం పాటించేది. కానీ ఇప్పుడు పనిచేసే తీరుతెన్నులు మారాయి. వృత్తులేవైనా వాటిల్లో కూర్చొని చేసేవే ఎక్కువ. కూర్చొని చేసే వృత్తులు గతంలోనూ ఉన్నాయి.

కానీ ఇప్పుడు కంప్యూటర్‌ ఆవిర్భావం తర్వాత పని అంటే కుర్చీకి అంటిపెట్టుకోవడంగా మారిపోయింది. ఒళ్లు కదులుతూ పనిచేయాల్సిన యువత కదలకుండా కుర్చీకి అతుక్కుపోతున్నారు. ఆరోగ్యాన్ని చిత్తుచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా ఒళ్లొంచి, కదులుతూ పనిచేయడం యువతకు నామోషీలాగా ఉంది కాబోలు.. కుర్చీలోంచి లేస్తే ఎవరు దాన్ని తన్నుకు పోతారో అనే విధంగా అతుక్కుపోతున్నారు. సకల అనర్ధాలకూ అదే కారణం అనేది మర్చిపోతున్నారు.
 
అతిగా కూర్చోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు (స్లీప్‌ డిజార్డర్స్‌) వస్తాయి. వీటివల్ల మెదడుకు, గుండెకు తగినంత రక్తం అందక అది గుండెపోటు లేదా పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కూర్చొని పనిచేసే కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగుల్లో కేవలం వేళ్లకదలికలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ వంటివి రావచ్చు. అంటే నరాలను ఎముకలు నొక్కి ఉంచడం వల్ల అరచేతి నొప్పులు, వేళ్లకు రక్తం అందక తిమ్మిర్లు పట్టడం వంటి పరిణామాలూ రావచ్చు. కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తుండటం వల్ల వచ్చే సమస్యల్లో మొదటిది స్థూలకాయం.  
 
స్థూలకాయం అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి. ఆ కారణంగా రక్తపు ఒత్తిడి పెరగడంతో అధిక రక్తపోటు వస్తుంది. అది డయాబెటిస్‌ వ్యాధికి కూడా కారణమవుతుంది. అదేపనిగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్య... కాలి రక్తనాళాల్లో కదలికలు తగ్గడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టే అవకాశాలుంటాయి. కాలి రక్తనాళాల కవాటాలు బలహీనం అవుతాయి. దాంతో అక్కడ గడ్డకట్టిన బ్లడ్‌క్లాట్స్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీనిని పల్మునరీ ఎంబాలిజం అంటారు. ఇది ప్రమాదకరమైన పరిణామం.
 
కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల వచ్చే ఆరోగ్య అనర్థాలను అధిగమించడానికి తప్పనిసరిగా పాటించాల్సింది ఏమిటంటే..  మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. అంటే అన్ని రకాల పోషకాలతోపాటు విటమిన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు  ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తిండి విషయంలో ఇలా ఉంటున్నామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. 
 
నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి. ఆఫీస్‌లో కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్‌ తీసుకొని అటు ఇటు నడవాలి. ఈ మూడు అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తే మీ ఆరోగ్యం కొంతవరకైనా మీ చేతుల్లో ఉన్నట్లే లెక్క.