1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 12 మే 2016 (15:55 IST)

సమ్మర్ టిప్స్ : మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే..?

వేసవికాలంలో ముఖ్యంగా కాఫీ, టీలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళు తెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది. పిల్లలను ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి. పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మరసం కలపి అందులో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో కూరగాయలతో జ్యూస్‌లు చేసుకుని తాగితే ఇంకా మంచిది.
 
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ ధరించాలి. వీటి వల్ల వేడి మన దరిచేరదు. ఖర్భుజాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
 
ఆహార పదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి. వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు ఖచ్చితంగా నీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి.