గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:03 IST)

థాయ్‌లాండ్ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం

bus fire
థాయ్‌లాండ్ దేశంలో ఓ నైట్ క్లబ్‌లో దారుణం జరిగింది. ఈ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగి ఏకంగా 13 మంది మృత్యువాతపడ్డారు. మరో 40 మందికి వరకు గాయపడినట్టు సమాచారం. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
థాయ్ దేశంలోని బ్యాంకాగ్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోన్‌బురి ప్రావిన్స్‌లోన సత్తాహిప్ జిల్లాలో గల మౌంటెన్‌ బీ నైట్‌స్పాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో క్లబ్బులో అనేక మంది ఉన్నారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో వారంతో ఆ మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో కొందరు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఈ మంటలు చుట్టుముట్టడంతో బయటకు రాలేక 13 మంది సజీవదహనమయ్యారు. 
 
అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న థాయ్ పోలీసులు ఆగమేఘాలపై ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే నైట్ క్లబ్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ప్రవేశ ద్వారాల్లో, బాత్రూములలో చిక్కుకున్న వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతులంతా థాయ్ పౌరులే. ఈ అగ్నిప్రమాదం భీకరంగా ఉండటానికి ప్రధాన కారణం నైట్ క్లబ్ గోడలకు ఉన్న రసాయన పదార్థాలే కారణమని, దీని కారణంగా మంటల తీవ్ర అధికంగా ఉన్నట్టు తేలింది. పైగా, వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది అధిక సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు తెలిపారు.